ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టనున్న మంత్రివర్గ విస్తరణకు వీలుగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి పదవికి బండారు దత్తాత్రేయ రాజీనామా చేశారు. అలాగే, మరో నలుగురు మంత్రులు కూడా శనివారం తమతమ పదవులకు రాజీనామా లేఖలు సమర్పించారు. దీంతో ఇప్పటివరకు మొత్తం రాజీనామా చేసిన వారి సంఖ్య ఏడుకు చేరినట్టయింది.
అయితే, తెలంగాణ నుంచి కేంద్ర మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకుంటారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మంత్రివర్గంలో తెలంగాణ నుంచి కొత్త వ్యక్తిని తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే అంశంపై చర్చించినట్టు తెలుస్తోంది. ఇపుడు కేంద్ర జలవనరుల శాఖ సలహాదారుగా పనిచేస్తున్న వెదిరె శ్రీరామ్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. వెదిరె శ్రీరామ్ భువనగిరికి చెందిన వ్యక్తి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ నుంచి కంభంపాటి హరిబాబుకు మంత్రి పదవి ఇవ్వడంపైనా సందిగ్ధత నెలకొంది.
ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్‌లకు కేంద్రమంత్రివర్గంలో ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉంది. శాసనసభ ఎన్నికల దృష్ట్యా గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌లకు అధిక ప్రాధాన్యం దక్కనున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్‌భగవత్‌తో భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌షా చర్చించినట్లు సమాచారం.
ఇంకోవైపు, శుక్రవారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ నివాసంలో సీనియర్ మంత్రులు సమావేశమై ప్రస్తుత పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో అరుణ్‌జైట్లీ, సుష్మాస్వరాజ్, నితన్‌గడ్కరీ పాల్గొన్నారు. పునర్‌వ్యవస్థీకరణలో పలు కీలక శాఖల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆదివారం ఉదయం 10 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు.