జమ్మూకాశ్మీర్ గడ్డపై దశాబ్దాలుగా తిష్టవేసి కూర్చొనివున్న ముస్లిం శరణార్ధులను తరిమిగొట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కఠిన నిర్ణయం తీసుకోనుంది. సాధ్యమైనంత త్వరగా వారిని గుర్తించి, దేశం నుంచి పంపించేందుకు తీసుకోవాల్సిన చర్యల దిశగా ఉపక్రమించాలని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి కేంద్రం సూచించింది. దీంతో 10 వేల మందికిపైగా రోహింగ్యా ముస్లింలను తిరిగి మయన్మార్‌కు వెళ్లనున్నారు.
మయన్మార్ నుంచి దేశంలోకి వచ్చిన రోహింగ్యా ముస్లింలలో అత్యధికులు జమ్మూ, సాంబా జిల్లాల్లో ఉంటున్నారు. వీరంతా చట్ట వ్యతిరేకంగా భారత్ - బంగ్లాదేశ్, భారత్ - మయన్మార్ సరిహద్దులు దాటడం లేదా బంగాళాఖాతం మీదుగా ప్రయాణించి భారత్‌కు వచ్చారు. వీరిని తిరిగి పంపే దిశగా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి రాజీవ్ మెహర్షి, జమ్మూకాశ్మీర్ చీఫ్ సెక్రటరీ బ్రజ్ రాజ్ శర్మ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎస్పీ వెయిద్ల మధ్య తాజాగా కీలక చర్చలు సాగాయి. ఈ చర్చల్లో వీరందరినీ తిరిగి వెనక్కి పంపాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
కాగా, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ లెక్కల ప్రకారం, సుమారు 10 వేల మంది రాష్ట్రంలో అక్రమంగా ఉంటుండగా, దేశవ్యాప్తంగా దాదాపు 40 వేల మంది వరకూ ఉండవచ్చని అంచనా. వీరిలో కొందరు ఐరాస శరణార్థ సంఘంలో రిజిస్టర్ చేసుకున్నా, వారిని గుర్తించేందుకు భారత్ నిరాకరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.