భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం ఇప్పటివరకు సాఫీగానే సాగుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా, జాబిల్లికి చంద్రయాన్-3 మరింత చేరువైంది. ఆదివారం రాత్రి కక్ష్య కుదింపు చర్యను చేపట్టినట్టు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతో జాబిల్లికి చంద్రయాన్ మరింత దగ్గరైందని, ఇదేవిధంగా కక్ష్య కుదింపు చర్యలు మరో రెండు ఉన్నాయని వారు వెల్లడించారు. అన్నీ సవ్యంగా సాగితే ఈ నెల 23వ తేదీన చంద్రయాన్-3 వ్యోమనౌక జాబిల్లిపై దిగుతుందని వారు తెలిపారు.
కాగా, ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం 1.00 నుంచి 2.00 గంటల మధ్య చంద్రయాన్-3 జాబిల్లికి మరింత దగ్గరయ్యేలా మరో చిన్న కక్ష్యలోకి ప్రవేశపెడతామని వారు తెలిపారు. ఆ తర్వాత రెండు సార్లు కక్ష్య మార్పు కార్యక్రమం ఉంటుందని వారు తెలిపారు. ఆఖరులో చంద్రుడికి 100 కిలోమీటర్ల ఎత్తున ఉన్న దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి చంద్రయాన్-3ని చేర్చుతారు.