జయలలిత వాడిన కుర్చీలో సీఎం పళనిస్వామి.. అమ్మ ఆత్మ ఏం చేస్తుందో?

సోమవారం, 20 ఫిబ్రవరి 2017 (17:21 IST)
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి పూర్తి స్థాయిలో పాలన మీద దృష్టి సారించారు. ఐదు నెలల తర్వాత సచివాలయంలోని తొలిసారి జయలలిత కార్యాలయానికి వెళ్లిన ఆయన ఏకంగా.. ఆమె వాడిన కూర్చీలోనే ఆశీనులయ్యారు. జయలలిత అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినప్పుడే.. కాదు రెండుసార్లు ఆమె జైలుకెళ్లినప్పుడు కూడా ఆ కుర్చీలో ఎవరూ కూర్చోలేదు. చివరకు జయలలిత మరణం తర్వాత అత్యంత విషాదకర పరిస్థితుల్లో సీఎం బాధ్యతలు చేపట్టిన పన్నీర్ సెల్వం.. జయలలిత గది వైపు కూడా తలపెట్టి చూడలేదు. 
 
దీనికి కారణం అమ్మమీదున్న గౌరవంతో ఆ కార్యాలయానికి ఆయన దూరంగా ఉన్నారు. ఇప్పుడు జయ లేకపోవడంతో, కె. పళనిస్వామి మాత్రం ఆ సెంటిమెంట్లను పట్టించుకోలేదు. నేరుగా కార్యాలయానికి వెళ్లి, జయలలిత కుర్చీలో కూర్చొని, కొన్ని ఫైళ్లపై సంతకాలు కూడా చేశారు. అయితే, బాధ్యతలను స్వీకరించే సమయంలో మాత్రం జయలలిత ఫొటోను టేబుల్‌పై పెట్టుకున్నారు. 
 
శనివారం బలపరీక్షలో నెగ్గిన తర్వాత ముఖ్యమంత్రి పళనిస్వామి సోమవారం తొలిసారి సచివాలయానికి వచ్చారు. తొలుత అమ్మ జ‌య‌ల‌లిత ఫొటో వ‌ద్ద‌ నివాళుల‌ర్పించారు. అనంత‌రం ప‌ద‌వీబాధ్య‌త‌లు స్వీకరించి, ఐదు కీల‌క ద‌స్త్రాల‌పై సంత‌కాలు చేశారు. మ‌హిళ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించారు. 
 
మ‌హిళ‌ల‌కు 50 శాతం రాయితీతో ద్విచ‌క్రవాహ‌నాల‌ను అందించే ప‌త్రాల‌పై సంత‌కం చేశారు. రాష్ట్రంలోని 500 మద్యం దుకాణాల మూసివేత ద‌స్త్రంపై, మ‌హిళ‌ల ప్రసూతి సాయాన్ని రూ.12000 నుంచి రూ.18000 వ‌ర‌కు పెంచే ద‌స్త్రంపై సంత‌కాలు చేశారు. నిరుద్యోగ యువ‌త‌కు ఇచ్చే నెల‌స‌రి భ‌త్యాన్ని రెట్టింపు చేసే ఫైళ్ళపై ఆయన సంతకాలు చేశారు. 

వెబ్దునియా పై చదవండి