దేశంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కావడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ప్రధాన కుట్రదారుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఈ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చురుగ్గా కొనసాగిస్తోంది. అయితే విచిత్రమైన కారణంతో దర్యాప్తు వేగం పుంజుకుంది.
కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన తర్వాత, ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన వాట్సాప్ చాట్‌లు, కాల్ డేటాను తిరిగి పొందేందుకు ఈడీ కేజ్రీవాల్‌కు చెందిన వ్యక్తిగత ఫోన్‌లను స్వాధీనం చేసుకుంది. కానీ కేజ్రీవాల్ తన ఐఫోన్‌కు పాస్‌వర్డ్‌ను మర్చిపోయాడని, ఫలితంగా ఈడీ అధికారులు అతని ఫోన్‌ను యాక్సెస్ చేయలేకపోయారని చెప్పడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది.
తన ఫోన్ పాస్‌వర్డ్‌ను మర్చిపోయినట్లు సీఎం చెప్పడంతో పాటు, పరికరాన్ని అన్‌లాక్ చేయాలన్న అభ్యర్థనను యాపిల్ తోసిపుచ్చడంతో, ఫోన్ డేటాను యాక్సెస్ చేయడంలో ఈడీ అధికారులు చాలా ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం.