ఉగ్రవాదుల చేతుల్లో వీరమరణం పొందిన కల్నల్ అశుతోష్ శర్మ

ఆదివారం, 3 మే 2020 (14:51 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని హంద్వారాలో ఉగ్రవాదులకు సైనిక బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో కల్నల్ అశుతోష్ శర్మ వీరమరణం చెందారు. హంద్వారాలోకి చొచ్చుకవచ్చిన ఉగ్రవాదులను ఏరివేసే చర్యల్లో పాల్గొని ప్రాణాలు కోల్పోయారు. శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఈయన ప్రాణాలు కోల్పోయారు. గత ఐదేళ్ళ కాలంలో కల్నల్ స్థాయి అధికారి ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి. 
 
అలాగే, హంద్వారా ఎన్‌కౌంటర్‌లో వీరమరణం పొందిన మిగతా జవాన్ల వివరాలు కూడా బయటకు వచ్చాయి. మేజర్ అనుజ్ సూద్, నాయక్ రమేశ్ కుమార్, లాన్స్ నాయక్ దినేశ్ సింగ్, జమ్మూకశ్మీర్ సబ్ ఇన్స్‌పెక్టర్ షకీల్ ఖాజీ ఉన్నారు. ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ఇద్దరు ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. 
 
మరోవైపు, ప్రాణాలు కోల్పోయిన అశుతోష్ వర్మ గతంలోనూ సాహసోపేతంగా వ్యవహరించారు. రెండు సార్లు గ్యాలంటరీ మెడల్ సాధించారు. కల్నల్ ర్యాంక్ ఉన్న అశుతోష్ 21 రాష్ట్రీయ రైఫిల్స్‌లో గార్డ్స్ రెజిమెంట్ బ్రిగేడ్‌‌కు నాయకత్వం వహిస్తున్నారు. కమాండింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
 
ఈ అమరవీరుడికి భార్య, ఓ కుమార్తె ఉంది. ఈయన గత కొంతకాలంగా జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేతలో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. గ్రెనేడ్‌‌ను దుస్తుల్లో దాచుకుని జవాన్ల వైపు దూసుకొస్తున్న ఉగ్రవాదిని అత్యంత సాహసోపేతంగా హతమార్చినప్పుడు అశుతోష్‌కు గ్యాలంటరీ మెడల్ దక్కింది.
 
గతంలో క్లోజ్ రేంజ్‌లో కాల్చి ఉగ్రవాదిని హతమార్చారు. దీంతో నాడు అనేకమంది జవాన్ల ప్రాణాలు కాపాడగలిగారు. అలాగే, హంద్వారా ఎన్‌కౌంటర్‌లో పాకిస్థాన్‌కు చెందిన లష్కర్ ఎ తొయిబా కమాండర్ హైదర్‌ను మట్టుబెట్టిన బృందానికి కూడా అశుతోష్ నేతృత్వం వహించారు. వీరమరణం పొందిన జవాన్ల త్యాగాలను ఎప్పటికీ మరచిపోలేమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు