సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత కర్ణాటక రాష్ట్రంలోని ముఖ్యమంత్రి హెచ్.డి.కుమార స్వామి సారథ్యంలోని కాంగ్రెస్ - జేడీఎస్ సర్కారు ఉండబోదని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సదానంద గౌడ జోస్యం చెప్పారు. ప్రస్తుతం, జేడీఎస్ - కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసివున్నాయి.
అయితే, సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కర్ణాటకలోని కాంగ్రెస్ - జేడీఎస్ సర్కార్ కూలిపోతుందని ఆయన జోస్యం చెప్పారు. మంగళవారం కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే రోషన్ బేగ్ సహా మరికొందరు కాంగ్రెస్ నాయకులు సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలోని సంకీర్ణ ప్రభుత్వం స్థిరత్వంపై ప్రభావం చూపిస్తాయని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలను నిజం చేసేలా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాధారణ మెజార్టీకి నాలుగైదు సీట్లు అధికంగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు కర్ణాటక ప్రభుత్వాలను కూల్చి తమ ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది.
అందువల్ల సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపొచ్చని భావిస్తున్నారు. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడమో లేదా నయానో భయానో బెదిరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఫలితంగా అటు మధ్యప్రదేశ్, ఇటు కర్ణాటక రాష్ట్రాల్లో అధికారపక్షం నేతల్లో గుబులు పుడుతోంది.