అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి నిర్వహించే ఎన్నికల షెడ్యూల్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 17వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. అదే రోజున ఫలితాన్ని వెల్లడిస్తారు. ప్రస్తుతం ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఈ పదవి కోసం ఎన్నికలు నిర్వహించేందుకు ఈ నెల 22వ తేదీన నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఆ తర్వాత 24 నుంచి 30వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు.
గత 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. దీంతో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడుగా ఉన్న రాహుల్ గాంధీ తన పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగుతున్నారు. ఈ క్రమంలో పార్టీకి రెగ్యులర్ అధ్యక్షుడి ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ షెడ్యూల్ విడుదల చేసింది.