జయలలితకు చికిత్స.. సీసీటీవీ కెమెరాలను స్విచ్ఛాఫ్ చేశాం.. అపోలో

ఆదివారం, 7 అక్టోబరు 2018 (11:53 IST)
తమిళనాడు మాజీ సీఎం జయలలిత మృతి మిస్టరీగా మారిపోయింది. తాజాగా జయలలిత మృతిపై కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిషన్ ముందు వస్తున్న అంశాలు విభిన్నంగా వున్నాయి. ఒకదానికొకటి పొంతన లేకుండా పోతున్నాయి.


గతంలో తమ వద్ద 30 రోజుల సీసీటీవీ ఫుటేజీలు మాత్రమే ఉన్నాయని చెప్పుకొచ్చిన అపోలో యాజమాన్యం.. తాజాగా.. జయలలితకు చికిత్స అందించిన గదికి దగ్గర్లోని సీసీటీవీ కెమెరాలను ఆఫ్ చేసినట్టు విచారణ కమిటీకి వెల్లడించింది. 
 
జయలలిత మృతిపై విచారణ జరుపుతున్న ఏకసభ్య కమిషన్ ఎదుట గవర్నర్‌ విద్యాసాగర్‌రావు‌, రమేశ్‌ చంద్‌ మీనా, అపోలో ఆసుపత్రులకు చెందిన సుబ్బయ్య విశ్వనాథన్‌ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో జయలలిత వున్న గది వద్ద సీసీటీవీ కెమెరాలను పోలీసుల ఆదేశాలతోనే కెమెరాలను స్విచ్ఛాప్ చేశామని అపోలో యాజమాన్యం తెలిపింది.
 
ఈ క్రమంలో జయకు చికిత్స అందించిన గది, ఐసీయూ, ఆ గది ప్రాంగణం, ఎంట్రన్స్‌తోపాటు ఇతర ప్రదేశాల్లోని సీసీటీవీలను కూడా పోలీసుల ఆదేశాలతో ఆపివేసినట్టు ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది. జయను స్కానింగ్‌కు తీసుకెళ్లిన సమయంలో అక్కడ ఉన్న కెమెరాలను కూడా ఆఫ్ చేసినట్టు పేర్కొంది. జయ భద్రతను దృష్టిలో పెట్టుకునే ఇలా చేయాల్సి వచ్చిందని విచారణ కమిటీకి సమర్పించిన నివేదికలో అపోలో స్పష్టం చేసింది. 
 
జయలలిత ఆరోగ్యంపై 23 సెప్టెంబరు 2016న విడుదల చేసిన తొలి బులెటిన్‌ను రూపొందించే విషయంలో జయలలిత కూడా పాలు పంచుకున్నారని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. ప్రెస్ రిలీజ్ వల్ల ప్రజల్లో భయం పోతుందని స్వయంగా ఆమె చెప్పారని పేర్కొంది. ఈ ప్రెస్ నోట్‌కు‌‌ రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీ రామ్‌మోహనరావు, హెల్త్‌ సెక్రటరీ జె.రాధాకృష్ణన్ ఆమోదం తెలిపిన తర్వాతే విడుదల చేసినట్టు పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు