లాక్‌డౌన్‌పై కీలక ప్రకటన చేయనున్న ప్రధాని మోడీ

శనివారం, 11 ఏప్రియల్ 2020 (10:49 IST)
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది. ఇది ఈ నెల 14వ తేదీతో ముగియనుంది. అయితే, దేశ వ్యాప్తంగా కొత్తగా నమోదవుతున్న కరోనా వైరస్ కేసుల సంఖ్యమాత్రం తగ్గలేదు. దీంతో పంజాబ్, ఒరిస్సా రాష్ట్రాలు ఈ లాక్‌డౌన్‌ను ఈ నెల 30వ తేదీ వరకు పొడగించాయి. అదేబాటలో తెలంగాణ రాష్ట్రంతో పాటు.. మరికొన్ని రాష్ట్రాలు పయనించనున్నాయి. 
 
ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌పై ప్ర‌ధాని నరేంద్ర మోడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు. క‌రోనా కార‌ణంగా దేశవ్యాప్తంగా కొన‌సాగుతున్న‌ లాక్‌డౌన్‌ను ఇంకా పొడిగిస్తారా.. లేదా? అనే సస్పెన్స్‌కు శనివారం తెర‌దించ‌నున్నారు. ఏప్రిల్ 15న లాక్‌డౌన్ గ‌డువు ముగియ‌నున్న నేప‌థ్యంలో ప్రధాని మోడీ శనివారం అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడ‌నున్నారు. 
 
ఈ సమావేశంలో లాక్‌డౌన్‌పై చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీడియో కాన్ఫ‌రెన్స్ అనంతరం ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించ‌నున్నారు. ఇదిలావుంటే కరోనా నియంత్రణకు దేశవ్యాప్తంగా తీసుకుంటున్న చర్యలపై ప్రధానమంత్రి కార్యాలయంలో అధికారులు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు