కరోనా వైరస్ కట్టడిలో దేశానికే ఆగ్రా ఆదర్శం ...

సోమవారం, 13 ఏప్రియల్ 2020 (16:20 IST)
మనదేశంలో ఉన్న అనేక పర్యాటక ప్రాంతాల్లో ఆగ్రా ఒకటి. ఇక్కడ ఉన్న పాలరాతి ప్రేమమందిరమైన తాజ్‌ మహాల్‌ని చూసేందుకు అనేక మంది విదేశీ, స్వదేశీ పర్యాటకులు వస్తుంటారు. అయితే, ఆగ్రాలో కూడా ఆరు కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఒక్క కేసు నమోదు కాకుండా కట్టడి చేయడంలో దేశానికే ఆదర్శంగా నిలించింది. దీనికి కారణం... పక్కాప్రణాళికతో లాక్‌డౌన్ అమలు చేయడమే. దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ విజృంభిస్తోంది. అలాంటి వైరస్‌ను ఆగ్రా నగర పాలక సంస్థ అధికారులు ఏ విధంగా కట్టడి చేశారన్న అంశాన్ని పరిశీలిద్దాం. 
 
దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రమైన తాజ్‌మహల్ ఉన్న ఆగ్రా నగరంలో మార్చి 3వ తేదీన మొట్టమొదటిసారి ఆరుగురు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో అప్రమత్తమైన ఆగ్రా మున్సిపల్ అధికారులు... నగరంలో ఇంటింటి సర్వే చేసి కరోనా పాజిటివ్ కేసులను గుర్తించి వారిని నిర్బంధంలో ఉంచారు 
 
కరోనా రోగులు నివశించిన ప్రాంతాల చుట్టూ ఉన్న 38 హాట్ స్పాట్లలో 3 కిలోమీటర్ల దూరం కంటైనర్ జోన్‌గా ప్రకటించి ఆంక్షలు విధించారు. విదేశాల నుంచి వచ్చిన వారిని ఆగ్రా మున్సిపల్ అధికారులు గుర్తించి వారితోపాటు వారి కుటుంబసభ్యులు, సన్నిహితులను క్వారంటైన్ చేశారు. కరోనా రోగులను ఆగ్రాలోని ఎస్ఎన్ మెడికల్ కాలేజీకి తరలించి చికిత్స చేశారు. 
 
కరోనా హాట్ స్పాట్‌లను శానిటైజ్ చేసి కరోనా కట్టడిలో విజయం సాధించారు. ఆగ్రా నగరంలో కరోనా కట్టడి కోసం చేపట్టిన పనులను కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ పర్యవేక్షించింది. ఆగ్రా స్మార్ట్ సిటీ కార్యాలయంలో 24 గంటలూ పనిచేసేలా హెల్ప్ లైన్‌ను ఏర్పాటు చేసి 3 వేల మంది ఆశావర్కర్లు, వాలంటీర్లతో కలిసి 1.6 లక్షల ఇళ్లలో ఇంటింటి సర్వే జరిపారు. 
 
ఆగ్రా నగరంలో 1.65 లక్షలమందిని పరీక్షలు చేసి కరోనా రోగులను క్వారంటైన్ చేయడం ద్వార ఈ వైరస్ వ్యాపించకుండా కట్టడి చేయగలిగామని ఆగ్రా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ముకేష్ కుమార్, ఆగ్రా జిల్లా కలెక్టర్ ప్రభు ఎన్. సింగ్, ఆగ్రా ఐజీ సతీష్ గణేశ్ చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు