బిహార్ రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాదితో పాటు.. ఢిల్లీలో పాజిటివ్ కేసులు పెరగడమే దీనికి నిదర్శనమని ఆయన చెప్పారు. ఒకవైపు కరోనా పాజిటివ్ కేసులతో పాటు.. మరోవైపు, ఒమిక్రాన్ కేసులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం నితీశ్ వ్యాఖ్యలు ఇపుడు సంచలనంగా మారాయి.
ముఖ్యంగా, బీహార్ రాష్ట్రంలో కరోనా మూడో దశ వ్యాప్తి మొదలైందని ఆయన చెప్పారు. బుధవారం ఆయన ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొని వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 47 కోవిడ్ కేసులు నమోదైన నేపథ్యంలో రాష్ట్రంలో థర్డ్ వేవ్ ప్రారంభమైనట్టుగా భావిస్తున్నట్టు ఆయన తెలిపారు.
అయితే పొరుగు రాష్ట్రాల్లో రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేసినా, మన రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు ఇంకా లేదన్నారు. ఒకవేళ పాజిటివ్ కేసులు పెరిగితే మాత్రం నైట్ కర్ఫ్యూను అమలు చేసే అంశాన్ని ఆలోచన చేస్తామని తెలిపారు. అలాగే, దేశంలో ఒమిక్రాన్ కేసులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆయన గుర్తు చేశారు.