భారత్‌లో 'అటల్ జీ' జయంతి రోజు నుంటి కరోనా టీకాల పంపిణీ!

బుధవారం, 9 డిశెంబరు 2020 (10:09 IST)
భారత మాజీ ప్రధానమంత్రి దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి రోజు నుంచి దేశంలో కరోనా టీకాల పంపిణీ ప్రారంభంకానుంది. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. తొలి టీకా పంపిణీ కార్యక్రమంలో స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొని ప్రారంభిస్తారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకూ కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ నుంచి సమాచారం అందింది.
 
క్రిస్మస్ 25వ తేదీన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జన్మదినం. ఆ రోజున అటల్ జీ జయంతి వేడుకలను కేంద్రం ఘనంగా జరుపనుంది. అదే రోజున దేశంలో కరోనా టీకా పంపిణీకి శ్రీకారం చుట్టాలని కేంద్రం నిర్ణయించింది. 
 
భారత ప్రధాని స్వయంగా టీకా పంపిణీని ప్రారంభిస్తారని, ఆపై 20 రోజుల వ్యవధిలో... అంటే, జనవరి 15 నాటికి కరోనాపై జరుగుతున్న పోరాటంలో ముందు నిలిచిన వారందరికీ వ్యాక్సిన్ పంపిణీ పూర్తవుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. 
 
కరోనా వారియర్లలో తొలుత వైద్యులు పారిశుద్ధ్య కార్మికులు తదితరులకు వ్యాక్సిన్‌ను పంపిణీ చేసేందుకు అన్ని రాష్ట్రాలకూ టీకాను అందుబాటులో ఉంచుతామని, ఆపై సామాన్య ప్రజలకు టీకాను ఇస్తామని అధికారులు వెల్లడించారు.
 
వ్యాక్సిన్ పంపిణీ కోసం ఇప్పటికే 'కోవిన్' పేరిట ప్రత్యేక సాఫ్ట్‌వేర్ తయారు కాగా, దీని లైవ్‌డిమాన్‌స్ట్రేషన్ సందర్భంగా రాష్ట్రాల వైద్య శాఖాధికారులతో కేంద్ర అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 
 
ఈ సాఫ్ట్‌వేర్‌లో పేరు నమోదైతేనే టీకా వేయాలని తెలిపారు. టీకా వేసిన తర్వాత కనీసం అరగంట పాటు అక్కడే ఉండాలని, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్‌లూ లేకుంటేనే ఇంటికి వెళ్లాల్సి వుంటుందని తేల్చి చెప్పారు.
 
ఇక ఈ సాఫ్ట్‌వేర్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఆధార్ కార్డు నంబర్‌ను నమోదు చేయాల్సిన అవసరం లేదని, సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి వివరాలను వైద్య బృందం తనిఖీ చేస్తుందని, ఆపై వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లి గుర్తింపు కార్డు చూపి టీకాను తీసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
 
ఇక ఒక్కో వ్యాక్సిన్ కేంద్రంలో 100 మందికి టీకాను ఇస్తామని, ఇక్కడ రెండు బృందాలు ఉంటాయని, ఒక బృందం రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తిని పరిశీలిస్తుందని, మరో బృందం వారికి టీకాను ఇస్తుందని అధికారులు తెలిపారు. 
 
ఈ బృందంలో వ్యాక్సినేటర్‌తో పాటు నర్స్, ఏఎన్ఎం, డాక్టర్, సహాయకుడు ఉంటారని, ముందు జాగ్రత్త చర్యగా ప్రతి వ్యాక్సిన్ కేంద్రం వద్ద ఒక అంబులెన్స్ ఉంటుందని, ఎవరిలోనైనా దుష్ప్రభావాలు కనిపిస్తే, వెంటనే చికిత్స చేసేందుకు వీలుగా ఏర్పాట్లు ఉంటాయని వెల్లడించారు.
 
టీకా తీసుకున్న వారి మొబైల్ ఫోన్‌కు ఒక మెసేజ్ వస్తుందని, ఆపై మూడు వారాల తర్వాత మరోమారు టీకా తీసుకోవాల్సిన తేదీ గురించిన సమాచారాన్ని పంపుతామని, రెండు డోస్‌లను తీసుకున్న వారికి వైద్య ఆరోగ్య శాఖ నుంచి ధ్రువపత్రం అందుతుందని తెలియజేశారు. ఇక వ్యాక్సిన్ కేంద్రంలో స్పాట్ రిజిస్ట్రేషన్‌కు అనుమతించబోమని స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు