దివంగత సీఎం జయలలిత మరణం తర్వాత తమిళనాట రాజకీయాలు నడిరోడ్డుకు వచ్చేశాయి. అన్నాడీఎంకేకు బలమైన నాయకత్వం లేకపోవడంతో పాటు మాజీ సీఎం పన్నీర్ సెల్వం ఉన్నా ఫలితం లేకపోయింది. పన్నీరుచే రాజీనామా చేయించి.. తాను సీఎం కావాలనుకున్న అమ్మ నెచ్చెలి శశికళ ప్రస్తుతం జైలులో శిక్ష అనుభవిస్తోంది. ఈ నేపథ్యంలో జయలలిత వారసురాలిగా రాజకీయ అరంగేట్రం చేసిన దీప.. అమ్మ ఆశయాలను నెరవేరుస్తుందని అందరూ అనుకున్నారు.
కానీ దీప, ఆమె భర్తల మధ్య ఏర్పడిన విభేదాలతో ఆమె స్థాపించిన పార్టీ పరిస్థితి దారుణంగా మారింది. సొంతంగా ఎంజీఆర్ అమ్మ పేరవైని స్థాపించిన దీప.. పన్నీరుకు దూరమైన సంగతి తెలిసిందే. కానీ పన్నీరును పక్కనబెట్టి.. తన భర్తతో పార్టీని ముందుకు తీసుకెళ్లిన దీప.. భర్త నుంచే వ్యతిరేకత రావడంతో దిక్కుతోచక తలపట్టుకున్నారు.
కాగా, శుక్రవారం దీప ఇంటి ముందు నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో దీప, మాధవన్ దంపతుల మధ్య మరోమారు విభేదాలు పొడచూపాయి. ఈ కార్యక్రమానికి అన్నాడీఎంకే పార్టీ రంగులతో ఉన్న పంచె కట్టుకున్న మాధవన్ అనుచరులను అంబేద్కర్ జయంతి వేడుకలకు పోలీసులు అనుమతించలేదు. దీంతో దీపకు ఆమె భర్తకు మధ్య విబేధాలు గుప్పుమన్నాయి.