జయలలితను శశికళ - నా సోదరుడు దీపక్ కలిసి చంపేశారు : దీప సంచలన ప్రకటన

ఆదివారం, 11 జూన్ 2017 (15:32 IST)
అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి, తన మేనత్త జయలలితను శశికళ, తన సోదరుడు దీపక్‌లు కలిసి కుట్రపన్ని చంపేశారనీ జయలలిత అన్న కుమార్తె దీపా జయకుమార్ సంచలన ఆరోపణలు చేశారు. అందువల్ల దీపక్‌ను తక్షణం అరెస్టు చేసి విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేసింది. 
 
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్‌, ఆదివారం ఉదయం పోయిస్ గార్డెన్‌లోకి దూసుకెళ్లారు. జయలలిత నివాసమైన వేదనిలయం ఇంటిపై హక్కులు తనవేనని వాదిస్తున్న దీప, తన మద్దతుదారులతో కలసి పోయిస్ గార్డెన్‌లోకి వెళ్లగా, పోలీసులు అడ్డుకున్నారు. 
 
ఈ సందర్భంగా దీపకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఇంటిపై మరెవరికీ హక్కులు లేవని, ఇది తమకు వారసత్వంగా వచ్చిన భవంతి అని ఈ సందర్భంగా దీప వ్యాఖ్యానించారు. దీపా జయకుమార్‌ రావడంతో ఈ ప్రాంతంలోని వేదనిలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అడ్డుకోవడంతో వేదనిలయంలోకి మాత్రం ఆమె వెళ్లలేకపోయారు. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన మేనత్త నివాసమైన పోయెస్ గార్డెన్‌లోకి వెళ్లకుండా అడ్డుకుని తమను అవమానించారని మండిపడ్డారు. శశికళ కుటుంబం నుంచి అన్నాడీఎంకేను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. తనపై హత్యాయత్నం జరిగినట్లు ఆరోపించారు.
 
పోయెస్‌ గార్డెన్‌లో జయలలిత చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించేందుకు వెళ్తే శశికళ కుటుంబసభ్యులతో కలిసి తనపై దాడి చేశాడని దీప ఆరోపించారు. జయలలిత నివాసం స్వాధీనానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటానన్నారు. 

వెబ్దునియా పై చదవండి