ఊపిరి పీల్చలేని ఢిల్లీ వాసులు.. ప్రమాదకరస్థాయికి కాలుష్యం!

ఆదివారం, 15 నవంబరు 2020 (09:05 IST)
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ నగరంలో వాయు కాలుష్య అత్యంత ప్రమాదకర స్థాయికి పడిపోయింది. దీపావళి సందర్భంగా టపాసులను కాల్చడంపై నిషేధం అమలులో ఉన్నప్పటికీ, పలు ప్రాంతాల్లో ప్రజలు మతలాబులను పేల్చారు. ఇదేసమయంలో పొరుగు రాష్ట్రాల్లోని పంట పొలాల్లో వ్యవసాయ వ్యర్థాలను రైతులు తగులబెడుతూ ఉండటంతో కాలుష్యం భారీగా పెరిగిపోయింది. దీంతో ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో నివశించే ప్రజలు ఊపిరి పీల్చడం కష్టంగా మారింది.
 
కాగా, గత గురువారం 314, శుక్రవారం నాడు 339గా ఉన్న ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ శనివారం నాడు ఏకంగా 414కు పెరిగిపోయింది. నగరంలో కాలుష్య స్థాయి పీఎం 2.5కు చేరుకుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గాలిలోని ధూళి ఊపిరితిత్తుల్లోకి చేరిపోయి, పలు రకాల వ్యాధులకు గురిచేయనుందని, కేన్సర్‌తో పాటు గుండె సమస్యలు పెరగనున్నాయని అధికారులు హెచ్చరించారు.
 
మరోవైపు, ఢిల్లీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో పీఎం 2.5 స్థాయి 400 దాటేసిందని, ఏక్యూఐ 60 పాయింట్లు దాటితేనే అనారోగ్యానికి సంకేతమని అధికారులు తెలిపారు. అటువంటిది 400 దాటడంతో, ప్రజలు తీవ్ర అనారోగ్యం ముంపున ఉన్నారని అన్నారు. 
 
కాగా, ఇప్పటికే వేలాది మంది ఢిల్లీ వాసులు కళ్లు మండుతున్నాయని, గొంతు నొప్పిగా ఉందని, ఊపిరి పీల్చుకోలేక పోతున్నామని చెబుతూ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. కరోనా మహమ్మారి మూడవ దశ విస్తరణలోకి ప్రవేశించిన వేళ, ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు