ఐపీఎల్ 2020 ఫైనల్, వరుసగా రెండోసారి టైటిల్ గెలుచుకున్న ముంబై ఇండియన్స్

మంగళవారం, 10 నవంబరు 2020 (23:15 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ ఫైనల్ పోరులో ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ పైన విజయం సాధించింది. గత 2019లోనూ ముంబై ఇండియన్స్ టైటిల్ చేజిక్కించుకున్నది. చెన్నై సూపర్ కింగ్స్ ఫీట్ ను ముంబై ఇండియన్స్ పునరావృతం చేసింది. 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ మరో 8 బంతులు మిగిలి వుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.
 
రోహిత్ శర్మ 51 బంతుల్లో 4X6, 5X4తో 68 పరుగులు చేసాడు. డికాక్ 12 బంతుల్లో 20 పరుగులు చేయగా యాదవ్ 20 బంతుల్లో 19 చేశాడు. ఇషాన్ 19 బంతుల్లో 33 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఐతే పొల్లార్డ్ 9 పరుగులు, పాండ్యా 3 పరుగులు వెంటవెంటనే ఔటయ్యారు. ఐతే అప్పటికే జట్టును ఇషాన్ విజయతీరాలకు చేర్చడంతో కెహెచ్ పాండ్యా సింగిల్ తీయడంతో జట్టు విజయం ఖాయమైంది.
 
ఇకపోతే అంతకుముందు ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 7 వికెట్లకు 156 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (65 నాటౌట్), రిషబ్ పంత్ (56) అర్థ సెంచరీలు నమోదు చేశారు. 22 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ జట్టును అయ్యర్, పంత్ జోడీ ఆదుకుంది. వీరిద్దరూ ధాటిగా ఆడడంతో స్కోరు బోర్డు ఉరకలేసింది. 
 
అయితే పంత్ అవుటయ్యాక వచ్చిన హెట్మెయర్ (5), అక్షర్ పటేల్ (9) రాణించకపోవడంతో ఢిల్లీ భారీస్కోరు సాధించలేకపోయింది. మరో ఎండ్‌లో అయ్యర్ ఉన్నా ఉపయోగం లేకపోయింది. చివరి ఓవర్లలో ఆ జట్టు పరుగుల వేగంగా బాగా మందగించింది. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3 వికెట్లు తీశాడు. నాథన్ కౌల్టర్ నైల్‌కు 2, జయంత్ యాదవ్‌కు వికెట్ లభించాయి. 
 
కాగా, ఢిల్లీ ఇన్నింగ్స్ ఆరంభంలో కుదుపులు చోటుచేసుకున్నాయి. క్వాలిఫయర్స్-2లో సన్ రైజర్స్‌పై వీరబాదుడు బాదిన స్టొయినిస్ ఈసారి తుస్సుమనిపించాడు. ఈ ఆసీస్ ఆల్ రౌండర్ ఆడిన తొలిబంతికే వెనుదిరిగాడు. ధావన్ (15), రహానే (2) కూడా విఫలమయ్యారు. 
 
కాగా, ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ముంబై జట్టులో ఒక మార్పు చేశారు. యువ లెగ్ స్పిన్నర్ రాహుల్ చహర్ స్థానంలో జయంత్ యాదవ్‌ను తీసుకున్నారు. ఢిల్లీ జట్టులో ఎలాంటి మార్పు చేయలేదు. క్వాలిఫయర్స్-2లో సన్ రైజర్స్‌పై నెగ్గిన జట్టునే ఫైనల్ బరిలో దింపారు. 
 
ఈ టైటిల్ పోరుకు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా నిలువగా, ముంబై జట్టు ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా నాలుగు సార్లు విజేతగా నిలిచి ఐదోసారి కప్ గెలిచి రికార్డు సృష్టించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు