న్యూఢిల్లీ : ఢిల్లీ హైకోర్టు మరో తీర్పు ఇచ్చింది. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్తతో శృంగారానికి అంగీకరించకపోవడం అనేది క్రూరత్వం కాదని స్పష్టీకరించింది. తన భార్య గర్భం ధరించిన దగ్గర్నుంచి తనతో సెక్సుకు అంగీకరించడంలేదంటూ ఓ భర్త ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. ఉదయాన్నే త్వరగా నిద్ర లేవడంలేదనీ, పైగా తనతో శృంగారానికి అంగీకరించడంలేదని అతడు కోర్టులో పిటీషన్ వేసాడు.
దీనిపై కోర్టు విచారణ చేపట్టింది. భార్య ఉదయం త్వరగా నిద్రలేవకపోవడమే కాదు మంచం మీదికే తనకు అవసరమైన పనులు కావాలని కోరడం వంటివన్నీ ఆమె ఆరోగ్య పరిస్థితిని, బద్ధకాన్ని తెలుపుతాయి తప్ప క్రూరత్వం కాదని తేల్చి చెప్పింది. కాగా అతడు తన భార్యతో విడాకులు కావాలని అంతకుముందు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. దానిని ఫ్యామిలీ కోర్టు కొట్టివేయగా హైకోర్టును ఆశ్రయించాడు సదరు భర్త. ఇక్కడ కూడా అతడి పిటీషన్‌ను తిరస్కరించింది హైకోర్టు.