ఏయ్ ఎస్పీ హద్దు మీరొద్దు.. బీజేపీ నేత ధాష్టీకంతో కన్నీరు పెట్టుకున్న మహిళా ఎస్పీ

సోమవారం, 8 మే 2017 (07:22 IST)
యోగి ఇలాకాలో బీజేపీ సీనియర్ నేత ధాష్టీకానికి జల్లా ఐపీఎస్ అధికారిణి కన్నీరు పెట్టారు. పాలనను ప్రక్షాళన చేస్తానని చెప్పుకుంటున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్ సొంత ఇలాకాలో ఘోరం జరిగింది. ఆదివారం సాయంత్రం ఘోరక్ పూర్‌లో ఐపీఎస్ అధికారిణిపై తీవ్రంగా గద్దించిన సీనియర్ బీజేపీ శాసనసభ్యుడు డాక్టర్ రాధామోహన్ దాస్ అగర్వాల్ వైఖరికి నొచ్చుకున్న ఆమె అందరూ చూస్తుండగానే కన్నీరు పెట్టారు.
 
గోరక్ పూర్ జిల్లాలోని కోలివా గ్రామ సమీపంలోని రోడ్డును కొంతమంది మహిళలు దిగ్బంధించిన ఘటనలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో అక్రమ సారాయి అమ్మకాలపట్ల పోలీసులు, పాలనాయంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తున్నారని మహిళలు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మహిళలకు, అక్కడికి చేరుకున్న పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. గుంపు తమపై రాళ్లు విసరడంతో లాఠీ చార్జీ చేశామని, కొంతమంది మహిళలు గాయపడ్డారని పోలీసులు చెప్పారు. 
 
ఈ ఘటన జరిగిన వెంటనే  సీనియర్ బీజేపీ ప్రజాప్రతినిధి అగర్వాల్ అక్కడికి చేరుకుని 2013 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ చారు నిగమ్‌తో వాదులాటకు దిగారు. పదే పదే ఆమెవైపు వేలెత్తి చూపిస్తూ గట్టిగా అరిచారు. నేను నీతో మాట్లాడలేదు. నాకు కథలు చెప్పొద్దు. నోరు మూసుకుని ఉండు. నీ హద్దులు దాటవద్దు అంటూ ఆమెకేసి వేలు చూపిస్తూ అరిచినట్లు వీడియోలో కనిపించింది.
 
దానికి బదులుగా ఆమె తాను ఇక్కడ ఇన్‌చార్జిగా పనిచేస్తున్నానని, నేనేం చేస్తున్నానో నాకు తెలుసని సమాధానమిచ్చారు. ఈలోపు అ ప్రాంతానికి సీనియర్ అధికారి చేరుకునే సమయానికి ఆ ఐపీఎస్ అధికారిణి హ్యాండ్ కర్చీఫ్‌ తీసుకుని తన కంటినుంచి కారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటున్నట్లు మొబైల్ లో తీసిన దృశ్యంలో స్పష్టంగా కనిపించింది. 
 
కాని ఆమెతో తాను చెడుగా ప్రవర్తించలేదని అగర్వాల్ చెప్పారు. ఈ ప్రాంతంలో మద్యం షాపుల నిర్వహణను మేము వ్యతిరేకిస్తున్నాం. మద్యం షాపులకు వ్యతిరేకంగా జనం శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేస్తున్నారు. కానీ ఈ మహళా అధికారి బలవంతంగా నిరసనకారులను తొలగించడానికి ప్రయత్నించారు. ఆమె ఒక మహిళను కొట్టారు,. మరో 80 ఏళ్ల వృద్ధుడిని లాగిపడేశారు. ఇది సహించరానిది అంటూ అగర్వాల్ ఆరోపించారు. 
 
ఈ ప్రాంతంలో పోలీసులకు అక్రమ మద్యం వ్యాపారులకు అవగాహన ఉందని, 15 రోజుల క్రితం మూసివేసిన మద్యం షాపును మళ్లీ ప్రారంభించడానికి అదే కారణమని ఆయన ఆరోపించారు. 
 
అయితే నిరసనకారులకు మద్దతు ఇవ్వడానికి వచ్చిన ప్రజాప్రతినిధి ఎంతగా ఆ ఆధికారిణిని గద్దించారంటే  ఆ దాష్టీకానికే ఆమె కన్నీరు పెట్టుకున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపించడం గమనార్హం.
 

వెబ్దునియా పై చదవండి