మా భర్తలు తాగాలి... వైన్ షాప్ ఇక్కడే ఉంచండి...!

శనివారం, 8 జులై 2017 (14:03 IST)
భర్త రోజు తాగొచ్చి గొడవ చేస్తే దానికి మించిన నరకం ఇంకొకటి ఉండదు. మద్యం సేవించే భర్త అంటే ఏ భార్యకైనా అసహ్యమే. గత కొన్నిరోజులుగా ఏపీ ప్రభుత్వం తీరుపై మహిళలు ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన వైన్ షాప్‌లను ఇళ్ళ మధ్యే వైన్ షాప్ యజమానులు పెట్టేస్తున్నారంటూ ఆందోళన కొనసాగిస్తున్నారు. వెంటనే వైన్ షాప్‌లను వేరే ప్రాంతానికి మార్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 
 
అయితే తమిళనాడులో మాత్రం మహిళలు వైన్ షాప్‌ను తరలించవద్దంటూ ఆందోళనకు దిగారు. తమ భర్తలు ఎంత తాగొచ్చి తమను చిత్రహింసలు పెట్టినా ఫర్వాలేదుగానీ వేరే ప్రాంతానికి తరలిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని మహిళలు ఆందోళన చేపట్టారు. ఈ వింత చూసిన కొంతమంది ఆశ్చర్యపోయారు. 
 
తిరుపూర్ జిల్లాలోని తనీర్ పండాల్ గ్రామంలో మహిళలు వైన్ షాప్ ముందు ఆందోళన చేపట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జనావాసాలకు మధ్యలో వైన్‌షాప్‌లు ఉండకూడదు. అందుకే ఎక్సైజ్ శాఖ అధికారులు వైన్‌షాప్‌ను జాతీయ రహదారికి దగ్గరలో ఏర్పాటు చేయాలని భావించారు. 
 
అయితే మహిళలు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ధర్నాకు దిగారు. మద్యం సేవించడానికి తమ భర్తలు వేరే ప్రాంతానికి వెళితే రోడ్డుప్రమాదాలు జరగడంగానీ, వేరే ఏ ప్రమాదం జరిగే అవకాశం ఉందని అధికారులు వేడుకున్నారు. మహిళల ఆందోళనతో అధికారులు ప్రస్తుతానికి వెనక్కి తగ్గారు. 

వెబ్దునియా పై చదవండి