ఇక ఆ మాత్ర ధర రూ.2.76 పైసలు మాత్రమే..

మంగళవారం, 17 జనవరి 2023 (08:57 IST)
దేశంలోని మెడికల్ షాపుల్లో లభించే మందులను తమకు ఇష్టమైన ధరలకు విక్రయించడానికి ఇకపై వీలు లేదు. ఈ మేరకు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్.పి.పి.ఏ) తగిన చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, ఏకంగా 128 ఔషధాల ధరలను సవరిస్తూ తాజాగా ఆదేశాలు జారీచేసింది. ఆ ప్రకారంగా మెడికల్ షాపుల్లో లభ్యమయ్యే మందుల్లో పారాసిటమాల్ ఒకటి. దీని ఒక్కో మాత్ర ధర రూ.2.76 పైసలుగా నిర్ణయించింది. 
 
అలాగే, సిట్రజన్ మాత్రం ధర రూ.1.68 పైసలు, ఇబుప్రొఫెన్ (400 ఎంజీ) ధర రూ.1.07 పైసలకు మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. అదేవిధంగా చక్కెర వ్యాధి రోగులకు అధికంగా ఉపయోగించే గ్లిమెపిరైడ్, వోగ్గిబొస్, మెట్ ఫార్మిన్ ధర రూ.13.83 పైసలుగా ఖరారు చేసింది. 
 
ఎన్.పి.పి.ఏ సవరించిన జాబితాలో యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు అమోక్సిసిలిన్, క్లవ్లానిక్, యాసిడ్, ఆస్తమా రోగుల వేసుకునే సాల్బుటమాల్, కేన్సర్ ఔషధం ట్రస్టుజుమాబాబ్, బ్రెయిన్ ట్యూమర్‌కు ఉపయోగించే టెమోజోలోమైడ్ వంటివి ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని మందులను ఎన్.పి.పి.ఏ నిర్ణయించిన ధరలకు మాత్రమే మెడికల్ షాపుల యజమానులు విక్రయించాల్సివుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు