బీఫ్ తినడం నేరం కాదని, ప్రజల ఆహార అలవాట్లలో జోక్యం చేసుకునే హక్కు ఎవ్వరికీ లేదని మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పళని ఆలయ పరిసరాల్లో ముస్లింలు నిర్వహిస్తున్న దుకాణాలను తొలగించాలని దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చింది.
న్యాయవాది, హిందూ మున్నేట్ర కళగం ప్రెసిడెంట్ అయిన పిటిషనర్ తన వాదనలు వినిపిస్తూ పవిత్రతకు మారుపేరైన పళని హిల్స్‌కు ఎన్నో రోజుల ఉపవాసాల తర్వాత భక్తులు తరలివస్తారని, ఈ క్రమంలో ఆలయ పరిసరాల్లో ఇస్లాం, ఇతర మతాలకు చెందిన వారు నిర్వహిస్తున్న బీఫ్ ఆహార దుకాణాలతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని పిటిషనర్ పేర్కొన్నారు.
ఈ వాదనలను జస్టిస్ ఎస్. మణికుమార్, సిటీ సెల్వమ్‌తో కూడిన డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది. మాంసాహారం భుజించడం నేరమని భారతీయ శిక్షా స్మృతిలో ఎక్కడా చెప్పలేదని, ఏ మతానికి చెందిన వారి ఆహార అలవాట్లలోనైనా ఏ చట్టమూ జోక్యం చేసుకోలేదని స్పష్టం చేసింది.