విజయ్ మాల్యాకు ఈడీ సమన్లు: మార్చి 18న హాజరుకావాలని ఆదేశాలు!

శుక్రవారం, 11 మార్చి 2016 (16:55 IST)
అప్పుల్లో కూరుకుపోయిన కింగ్‌ఫిషర్ మాజీ అధినేత విజయ్ మాల్యాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ సమన్ల మేరకు మార్చి 18న హాజరుకావాలని ఆదేశించింది. రూ.9వేల కోట్లు లోన్ ఎగవేతకు సంబంధించి ప్రశ్నించేందుకే ఈడీ ఈ సమన్లను మాల్యాకు పంపింది. అయితే దొంగచాటుగా లండన్ వెళ్లిపోయిన మాల్యా ఈ సమన్లపై ఎలా స్పందిస్తారో అనేది ప్రశ్నార్థకమైంది. మరోవైపు మాల్యా లండన్‌కు వెళ్ళిపోయినా.. కొందరు కింగ్‌ఫిషర్ అధికారులను సీబీఐ ప్రశ్నించింది. 
 
ఇకపోతే., బ్యాంకుల నుంచి రూ.9వేల కోట్ల రుణాలు తీసుకుని వాటిని తిరిగి చెల్లించకుండా విజయ్ మాల్యా ఈ నెల 2న దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారని అటార్నీ జనరల్‌ ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే. అంతేకాదు మాల్యా తీసుకున్న రుణాల కంటే ఎక్కువ ఆస్తులు ఆయనకు విదేశాల్లో ఉన్నాయని ఆయన సుప్రీంకు నివేదించారు. విజయ్ మాల్యా లండన్‌కు గత బుధవారం (మార్చి 2) న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ పారిపోయినట్టు ప్రభుత్వ ఉన్నతాధికారులు చెప్తున్నారు. 
 
ఢిల్లీ-లండన్ జెట్ ఎయిర్ వేస్ విమానం 9W 122లో బ్రిటన్‌కు మాల్యా వెళ్ళినట్లు తెలుస్తోంది. మాల్యా వెంట ఒక మహిళ కూడా ఉన్నారని, ఫస్ట్‌క్లాస్‌లో ఆయన ప్రయాణించినట్టు, ఈ సందర్భంగా మాల్యా భారీ లగేజ్‌ను తీసుకెళ్లినట్లు సమాచారం. తనతో పాటు ఏడు బ్యాగుల్ని మాల్యా పట్టుకెళ్లారని తెలిసింది.

వెబ్దునియా పై చదవండి