దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని అంథేరి ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున 5.15 గంటల సమయంలో ఓ మందుల దుకాణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఉన్నట్టుండి మంటలు చెలరేగడంతో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు... వారిలో నెలల పసికందు కూడా ఉంది.
ఈ ప్రమాదం జరిగిన బిల్డింగ్‌లో కింద మెడికల్ షాప్ ఉండగా, పైన ఫ్లోర్‌లో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో కుటుంబసభ్యులు అంతా గాఢనిద్రలో ఉన్నారు. క్షణాల్లో మంటలు భవనం మొత్తం వ్యాపించాయి. దీంతో వారికి తప్పించుకునే అవకాశం లేక వారంతా సజీవదహనమైనట్టు పోలీసులు వెల్లడించారు. కాగా, సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపుచేశారు.