జయలలితను కంటికి చూపించండి.. గవర్నర్ గారూ ఓ లుక్కేయండి: కరుణ

శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (17:38 IST)
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి నెలకొన్న వదంతులపై అపోలో వైద్యులు స్పష్టత ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి అన్నారు. జయమ్మ ఆరోగ్య విషయంలో అనవసరమైన గోప్యత పాటించాల్సిన అవసరం ఏమొచ్చిందని కరుణ అసనహం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఆస్పత్రిలో ఉంటే ఆమె ఆరోగ్య పరిస్థితి తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందన్నారు. జయలలిత ఆరోగ్య పరిస్థితిపై పుకార్లకు చరమగీతం పలకాలంటే గవర్నర్‌ తన అధికారాలను ఉపయోగించాలని కరుణానిధి డిమాండ్‌ చేశారు.
 
జయలలిత ఈ నెల 22న ఆస్పత్రిలో అనారోగ్యం కారణంగా చేరిన సంగతి తెలిసిందే. ఆమె ఆరోగ్యం పట్ల తమిళనాడు ప్రజలు, అన్నాడీఎంకే శ్రేణులు, అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఆమె ఆరోగ్య పరిస్థితిపై లేనిపోని వదంతులు ప్రచారంలో ఉన్నాయని.. వీటికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే.. ఆస్పత్రిలో ఉన్న ఆమె ఫోటోలను విడుదల చేయాలని కరుణ డిమాండ్ చేశారు.
 
జయలలిత, తనకు సైద్ధాంతిక విభేదాలున్నప్పటికీ ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలన్నదే తన అభిమతమని స్పష్టం చేశారు. ఆస్పత్రిలో ఉన్న జయలలిత సందర్శకులను కలుస్తున్నారా? లేదా? అన్న విషయం కూడా తెలియట్లేదన్నారు. ఇంకా జయలలితను చూపించాలని కరుణ డిమాండ్ చేశారు. రాష్ట్ర గవర్నర్‌ జోక్యం చేసుకుని జయలలిత ఆరోగ్య పరిస్థితిని ప్రజలకు వివరించాలని కరుణానిధి కోరారు.

వెబ్దునియా పై చదవండి