"నీ కన్నీరు ఎంతో మంది హృదయాలను రగిలిస్తోంది" : వైరల్‌గా డీఐజీ పోస్ట్

బుధవారం, 30 ఆగస్టు 2017 (12:52 IST)
ఉగ్రవాదుల తూటాల వర్షానికి వీరమరణం పొందిన ఓ జవాను కుమార్తెను ఓదార్చుతూ సౌత్ కాశ్మీర్ డీఐజీ చేసిన ఓ పోస్ట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. "నీ కన్నీరు ఎంతో మంది హృదయాలను రగిలిస్తోంది" అంటూ ఆయన ట్వీట్ చేయగా, దీనిపై  నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు.
 
కాశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాదులను సమూలంగా ఏరివేసేందుకు గత కొంత కాలంగా భారత సైన్యం తీవ్రంగా శ్రమిస్తోంది. ఇందులోభాగంగా, పలువురు ఉగ్రవాదులను హతమార్చుతూనే.. మరికొందరు భారత జవాన్లు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా ఉగ్రదాడిలో మరణించిన ఓ జవాను కుమార్తెను ఓదార్చేందుకు భారత సైన్యాధికారులు కదిలొచ్చారు. 
 
సోమవారం తన రోజువారీ విధి నిర్వహణలో భాగంగా అబ్దుల్ రషీద్ పీర్ అనే జవాను అనంతనాగ్ జిల్లాలోని ఓ మార్కెట్ ప్రాంతానికి వెళ్లగా, ఉగ్రవాదులు దాడి చేసి కాల్చి చంపారు. అబ్దుల్ రషీద్‌కు ఏడేళ్ళ కుమార్తె ఉంది. ఆమె పేరు జోహ్రా. తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేని ఆమె, బోరున విలపిస్తుంటే ఆయనకు నివాళులు అర్పించేందుకు వచ్చిన అధికారుల కళ్లు చమర్చాయి. 
 
"మా నాన్న ఏ తప్పూ చేయలేదు. ఆయన్ను ఎందుకు చంపారు. నాన్నను తలచుకుంటే నాకెంతో గర్వంగా ఉంది. ఆయన్ను హత్యచేసిన వారు శిక్షించబడాలి" అని జోహ్రా అక్క అక్కడికి వచ్చిన అధికారులతో చెప్పింది. ఇక జోహ్రా బాధను తెలుసుకున్న దక్షిణ కాశ్మీర్ పోలీస్ డీఐజీ "నీ కన్నీరు ఎంతో మంది హృదయాన్ని తాకుతోంది. ప్రతి కన్నీటి చుక్కా ప్రతీకారేచ్ఛను రిగిలిస్తోంది. నీ తండ్రి ఓ నిజమైన పోలీసు అధికారి. డ్యూటీ చేస్తూ త్యాగం చేసిన అమరజీవి. బాధపడకు" అంటూ తన ఫేస్ బుక్ లో పోస్టును పెడుతూ జోహ్రా కన్నీరు కారుస్తున్న ఫోటోను యాడ్ చేశారు. ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ అయింది. 

వెబ్దునియా పై చదవండి