2012 ఏప్రిల్‌లో ముంబై శివారు ప్రాంతంలో ఇంద్రాణి తన మాజీ భర్తతో కలిసి కారులో తన కుమార్తె షీనాను గొంతు నులిమి చంపేశారన్న ఆరోపణలతో సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. 2015లో ముంబయి సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి సగం కాలిపోయిన స్థితిలో షీనా మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ హత్యకేసులోనే ఇంద్రాణి, సంజీవ్ ఖన్నాలు జైలు శిక్ష అనుభవిస్తున్నారు.
ఈ నేపథ్యంలో షీనాబోరా కేసులో మరో కొత్త కోణం వెలుగుచూసింది. షీనాబోరాను ఇంద్రాణి, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నాతో కలిసి హత్య చేసిందని ప్రధాన సాక్షిగా ఉన్న ఇంద్రాణి కారు డ్రైవర్ శ్యామ్‌వర్ రాయ్ నిజాన్ని అంగీకరించాడు. షీనా మృతదేహానికి ఇంద్రాణి లిప్ స్టిక్ రాసి, జుట్టు సరిచేసి, పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు రాయ్ ముంబై కోర్టుకు వివరించాడు.
అంతేగాకుండా ఇంద్రాణి, సంజీవ్ ఖన్నా, షీనాబోరా కలిసి కారులో బాంద్రా నుంచి బయలుదేరినట్లు, ఆ తర్వాత ఇంద్రాణి చెప్పిన ప్రకారం తాను, సంజయ్‌లు షీనాను గట్టిగా పట్టుకోగా ఆమె గొంతు నులిమి చంపేసిందని డ్రైవర్ అంగీకరించాడు. ఆ తర్వాత పాలి హిల్ వద్ద మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టినట్లు తెలిపాడు. ఈ విషయాలు బయటకి చెప్పొద్దని.. చెప్తే ప్రమాదమని ఇంద్రాణి తనను బెదిరించినట్లు డ్రైవర్ అంగీకరించాడు. దీంతో ఇంద్రాణికి కఠిన శిక్ష తప్పదని పోలీసు వర్గాల సమాచారం.