తప్పులు చేసి ఉంటే మన్నించి మరిచిపోండి. నేనిప్పుడు మారిన మనిషిని. మీ మనిషిని. మీకు సేవ చేసుకునే అవకాశం ఈసారి తప్పక కల్పించండి అంటూ ఓటర్లకు విన్నపాలు చేసుకునే రాజకీయ నేతలను, అభ్యర్థులను చాలామందిని చూశాం. కానీ చెప్పులతో తన్ను తాను ఎడా పెడా వాయించుకుని మరీ ఓటర్లకు క్షమాపణలు చెప్పిన అరుదైన ఘటన ఈ దఫా అసెంబ్లీ ఎన్నికలలో జరిగింది.
యూపీ ఎన్నికల ప్రచారంలో అరుదైన, అనుకోని ఘటన చోటుచేసుకుంది. గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా బరిలోకి దిగి ఓటమి పాలైన సమాజ్‌వాదీ పార్టీకి చెందిన షుజాత్ ఆలం ఈసారి కూడా తన అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు. ఈయన బీఎస్పీ అభ్యర్థి హజీఅలీంపై పోటీ చేస్తున్నారు.
రెండు రోజుల క్రితం బులందర్‌షహర్‌లో షుజాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ ఒక్కసారిగా కాలి షూ తీసి ఆ చెంప, ఈ చెంప ఎడాపెడా వాయించుకున్నారు. తెలియక ఏమైనా తప్పులు చేసి ఉంటే మన్నించాలని కోరుతూ ప్రజల సమక్షంలో చెంపలు వాయించుకుని తనకు తానే దండించుకున్నారు.