రాహుల్ గాంధీ చెప్పేది నిజమవుతుందా.. ఎగ్జిట్ పోల్స్ అంతా తిరగబడతాయా..?
శుక్రవారం, 10 మార్చి 2017 (14:12 IST)
ఉత్తరప్రదేశ్, పంజాబ్ వంటి పెద్ద రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన క్షేత్రపరిశీలనలో మునిగిన ఎన్నికల నిపుణులు, సుప్రసిద్ధ జర్నలిస్టులూ ముక్తకంఠంతో ఒకే మాట చెప్పారు. ఈ దఫా ఎన్నికల్లో పైకి బీజేపీది పైచేయిగా కనిపిస్తోందని, గ్రామస్థాయి ఓటర్లలో కూడా నోట్ల రద్దు వంటి కీలక అంశం పెద్దగా ఓటర్లను ప్రభావితం చేయలేదని, మోదీ జనాకర్షణ మంత్రం ఇంకా సాగుతోనే ఉందని, అఖండ మెజారిటీ రాకున్నా అతిపెద్ద పార్టీగా బీజేపీనే అవతరించే అవకాశం ఉందని చెబుతూనే ఎన్నికల నిపుణులు ఒక సందేహం వెలువరించారు.
అదేమిటంటే.. పైకి కమలానికి అనుకూలత కనిపిస్తున్నా ఒక్కో పోలింగ్ దశ పూర్తయ్యేసరికి రాజకీయ సమీకణాలు, ఫలితాలపై గందరగోళం తలెత్తుతోందని, గుంభనంగా ఉంటూ ఎవరివైపు సానుకూలత చూపని ఓటర్లు అంతిమ తీర్పుపై ప్రభావం చూపనున్నారని విశ్లేషకులంతా సందేహం వ్యక్తం చేశారు.. కానీ 9వ తేదీ నాటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు అందరినీ నివ్వెరపరుస్తున్నాయి. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ హవానే సాగనుందని ఎక్కువ పోల్స్ చెప్పగా కనీసం మూడు రాష్ట్రాల్లో బీజీపేనే పాగా వేయనుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. ఇది నిజమేనా?
ఎన్నికలు జరిగిన తర్వాత వాటిలో ఎవరు గెలుస్తారో.. ఎవరు పరాజితులు అవుతారో చెప్పడం అంత సులభం కాదు. అందులోనూ పలు దశలుగా ఎన్నికలు జరిగినప్పుడు, పెద్ద రాష్ట్రాలు అయినప్పుడు ఓటర్ల నాడిని పసిగట్టడం అంటే చాలా కష్టం అవుతుంది. రెండు రోజుల్లో ఫలితాలు విడుదల కానున్న ఈ తరుణంలో గురువారం సాయంత్రం ఐదు గంటల తర్వాత వివిధ మీడియా సంస్థలు తాము నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బీజేపీకి అమితానందం కలిగించగా సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ వంటి పెద్ద పార్టీలు కాస్త ఢీలాపడ్డాయి. ముఖ్యంగా అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌లో అందరి అంచనాలు బీజేపీ వైపే మొగ్గు చూపుతుండటంతో ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ దాదాపు ఓటమిని అంగీకరించినట్లే ప్రకటన చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ బీజేపీని అధికారంలోకి రానివ్వమని బీఎస్పీతో కూడా సంప్రదించడానికి తాము సిద్దమని అఖిలేష్ పేర్కొనడం తమకూటమికి అంత సీన్ లేదని ఒప్పుకున్నట్లే అయింది.
ఇంతకుముందు కూడా పలు ఎన్నికల విషయంలో ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి గానీ.. వాటిలో వాస్తవాలు చూస్తే నేతిబీరలో నెయ్యిలాగే ఉంటున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో పార్టీవైపు మొగ్గుచూపుతున్న ఈ ఎగ్జిట్ పోల్స్ గతంలో వివిధ ఎన్నికల సందర్భంగా ఏం చెప్పాయో.. వాటిలో నిజానిజాలు ఏంటో ఒక్కసారి చూస్తే, వీటిమీద ఎంతవరకు ఆధారపడవచ్చో అర్థం అవుతుంది. ఒక్కోసారి కొన్ని కొన్ని సంస్థలు కాస్త దగ్గరగా వచ్చి, కొంతవరకు ట్రెండ్లను అంచనా వేస్తున్నాయి గానీ, లెక్కల్లో మాత్రం చాలా తేడాలుంటున్నాయి. 2015 ఢిల్లీ అసెంబ్లీ, 2015 బిహార్ అసెంబ్లీ, 2014 యూపీలో లోక్‌సభ ఎన్నికలు, 2012 యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వివిధ మీడియా సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ వివరాలను ఒక్కసారి పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.
ముఖ్యంగా 2015 ఫిబ్రవరి నాటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 70 స్థానాలకు గాను 67 స్థానాలు సాధిస్తుందని ఏ ఒక్క న్యూస్ చానల్ కానీ, అంచనా వేయలేకపోయాయి. ఇండియాన్యూస్ - యాక్సిస్ సర్వే సంస్థ మాత్రమే ఆప్ 53 స్థానాలు సాధిస్తుందని ఉరామరిగా అంచనా వేసింది. కాని ఇక్కడ సైతం ఆప్ మరో 14 సీట్లు అధికంగా సాధించి ఎన్నికల ముందస్తు పోల్స్ డొల్లతనాన్ని ఎత్తి చూపింది. ఈ నేపథ్యంలో 2017 అసెంబ్లీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు సరైనవేనా అనేది సందేహాస్పదంగానే ఉంటోంది.
ముందస్తు అంచనాలు చె్ప్పేది నిజమే అయితే ఈసారి బీఎస్పీ అధినేత మాయావతి పంట పండినట్లే మరి. బీజేపీ, ఎస్పీ అనే రెండు పొట్టేళ్ల భీకర సమరంలో బీఎస్పీ అనే మేక గెలుపు సాధిస్తోంది. హంగ్ తప్పదనుకుంటే బీఎస్పీ ప్రమేయం లేకుండా ఉత్తరప్రదేశ్‌లో ఏ పార్టీ కూడా అధికారాన్ని సాదించలేదు. మరేమో మాయావతి అధికారాన్ని ఒకరికి అప్పగించాలంటే ససేమిరా ఒప్పుకోరు. మార్చి 11 ఉదయానికి ఎగ్జిట్ పోల్స్ ఉత్కంఠకు తెరపడనుంది. మరోవైపు రాహుల్ గాంధీ ఈ ఎగ్జిట్ పోల్స్ అంతా ట్రాష్ అనీ, యూపీలో తాము ఘన విజయం సాధించబోతున్నామని ప్రకటించారు.