పోలీసు కాల్పుల్లో రైతు మృతి... ఛలో ఢిల్లీకు రెండు రోజుల విరామం

వరుణ్

గురువారం, 22 ఫిబ్రవరి 2024 (10:18 IST)
కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్న ప్రధాన డిమాండ‌తో పాటు ఇతర సమస్యల పరిష్కారం కోసం రైతులు చేపట్టిన ఛలో ఢిల్లీ ఆందోళనకరంగా మారింది. బుధవారం రైతులు, పోలీసులకు మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. దీంతో పోలీసుల జరిపిన కాల్పుల్లో ఒక రైతు ప్రాణాలు కోల్పోగా, మరో రైతు గాయపడ్డారు. గాయపడిన రైతు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు రైతు సంఘాల నేతలు తెలిపారు. ఇదిలావుంటే, ఛలో ఢిల్లీ కార్యక్రమం పంజాబ్ - హర్యానా రాష్ట్రాల సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. రైతులకు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఈ ఆందోళనకు రెండు రోజుల పాటు తాత్కాలిక విరామం ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని రైతు సంఘాల నేతలు ప్రకటించారు. 
 
ఇదే అంశంపై పంజాబ్ కిసాన్ మజ్ఞూర్ సంఘర్ష్ కమిటీ నాయకుడు సర్వన్ సింగ్ పందేర్ బుధవారం హర్యానా పోలీసుల మధ్య జరిగిన ఘర్షణపై మీడియాతో మాట్లాడారు. ఖనౌరీ - శంభు సరిహద్దుల్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై హర్యానా పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారని, దీనిని ఖండిస్తున్నామన్నారు. చాలా మంది రైతులు గాయపడ్డారని, చాలా మంది కనిపించడం లేదని పందేర్ పేర్కొన్నారు. ఈ పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని రాబోయే రెండు రోజుల పాటు 'ఛలో ఢిల్లీ' మారున్ను నిలిపివేయాలని నిర్ణయించుకున్నామని, ఈ రెండు రోజుల విరామంలో గాయపడిన, కనిపించకుండా పోయిన రైతుల కుటుంబాలను కలుస్తామని వెల్లడించారు. 
 
పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత హామీ విషయంలో ప్రభుత్వం పారిపోతోందన్నారు. రైతులు రహదారిని దిగ్బంధించలేదని, ప్రభుత్వమే ఆ పని చేసిందని ఆయన అన్నారు. శాంతియుతంగా ముందుకు వెళ్తామని చెబుతూనే ఉన్నామని పేర్కొన్నారు. కాగా రైతులు - హర్యానా పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో ఒక యువ రైతు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ మరో ఇద్దరు రైతుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పాటియాలాలోని రజింద్ర హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ రేఖీ వెల్లడించారు. 
 
అలాగే, ఈ ఘర్షణలపై హర్యానా పోలీసు అధికారి మనీషా చౌదరి స్పందించారు. దాటా సింగ్ - ఖానౌరీ సరిహద్దులో రైతు నిరసనకారులు పోలీసు సిబ్బందిని చుట్టుముట్టారని తెలిపారు. పోలీసులను అడ్డుకునేందుకు పంట వ్యర్థాలను తగలబెట్టి మంటల్లో కారం పోశారని, పోలీసులపైకి రాళ్లు రువ్వారని తెలిపారు. కర్రలతో పోలీసులపై దాడి చేశారని, ఈ ఘటనలో 12 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారని వివరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు