ట్రాక్టర్ ర్యాలీ.. ఎర్రకోటకు చేరుకున్న రైతులు.. కత్తులతో పోలీసులపై..? (video)

మంగళవారం, 26 జనవరి 2021 (14:32 IST)
Red fort
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ 'ట్రాక్టర్ ర్యాలీ' చేపట్టిన రైతులు ఎర్రకోటకు చేరుకున్నారు. ఎర్రకోట బురుజులపై జెండాలను ఊపుతూ హల్‌చల్ చేశారు. రిపబ్లిక్ డే పరేడ్‌ కంటే ముందే మంగళవారం ట్రాక్టర్ ర్యాలీ చేపట్టిన రైతులు పెద్ద సంఖ్యలో ఢిల్లీలోకి వివిధ ప్రాంతాల నుంచి అడుగుపెట్టారు. వారిని నిరోధించేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయడంతో రైతులు బారికేడ్లు దాటే ప్రయత్నం చేయడంతో వారిని నిరోధించే క్రమంలో పలు భాష్పవాయిగోళాలు, లాఠీలకు పోలీసులు పని చెప్పారు. 
 
ఐటీఓ వద్ద రైతులు-పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న క్రమంలోనే ఒక గ్రూపు ఎర్రకోట వైపు దూసుకువెళ్లింది. ఎట్టకేలకు ఎర్రకోట చేరిన రైతు ఆందోళనకారులు ఎర్రకోట బురుజులపై జెండాలు ఊపుతూ సందడి చేశారు. తమకు నిర్దేశించిన మార్గంలో కాకుండా రైతు నిరసనకారులు వేరే మార్గంలో ఎర్రకోటకు చేరినట్టు చెబుతున్నారు.
 
రిపబ్లిక్ డేనాడే రైతుల కిసాన్ ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ముందుగా చెప్పిన సమయం, దారుల్లో కాకుండా ముందుగానే ర్యాలీ మొదలుపెట్టి సెంట్రల్ ఢిల్లీలోకి రావడానికి ప్రయత్నించిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. లాఠీచార్జ్ చేయడంతోపాటు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయితే ఈ సందర్భంగా కొందరు నిహంగ్ ఆందోళనకారులు తమ దగ్గర ఉన్న ఖడ్గాలను పోలీసులపై దుయ్యడం గమనార్హం. 
 
వీటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. ఢిల్లీలోకి అక్షర్‌ధామ్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఇక మరోవైపు ఇద్దరు రైతులు ట్రాక్టర్‌తో స్టంట్లు చేస్తుండగా అది బోల్తా పడింది. నిజానికి ఉదయం 11 గంటలకు కిసాన్ ర్యాలీ ప్రారంభం కావాల్సి ఉండగా.. ఉదయం 8 గంటల నుంచే వేలాది మంది రైతులు ఢిల్లీలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు