భువనేశ్వర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం...24 మంది సజీవ దహనం

మంగళవారం, 18 అక్టోబరు 2016 (11:02 IST)
ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ శివారు షాంపూర్‌లో సమ్‌ ఆసుపత్రిలో సోమవారం రాత్రి ఘోర అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో 24 మంది మరణించారు. ఫైర్ సర్వీస్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం రాత్రి 7:30 గంటల సమయంలో హాస్పిటల్లోని 2వ అంతస్తులో వున్న డయాలసిస్ వార్డులో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు అంటున్నారు. అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో ఈ వార్డులో దాదాపు 30 మంది వరకు పేషెంట్లు ఉన్నారని సిబ్బంది తెలిపారు. ఆసుపత్రి భవనంలోని డయాలసిస్‌ వార్డులో విద్యుత్తు షార్టుసర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగింది. 
 
ఆసమయంలో వార్డులోని ఐసీయూలో 20 మంది, పక్కనున్న వార్డులో 50 మంది వరకు రోగులున్నారు. ప్రమాదం జరగడంతో వార్డు, పరిసరాలు పొగతో కమ్ముకున్నాయి. కిటికీలు, అద్దాలను పగులగొట్టి రోగులు, క్షతగాత్రులు, సహాయకులను ఆసుపత్రి బయటకు తెచ్చారు. ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన వారిని వేరే ఆస్ప‌త్రుల‌కు తరలిస్తుండగా పది మంది మృత్యువాత పడ్డారు. ఊపిరాడక అస్వస్థతకు గురై వీరంతా మృతి చెందినట్లు ఆమ్రీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. 
 
మ‌రోవైపు భువనేశ్వర్‌లోని ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగిన సంఘటనపై ప్రధాని మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. తీవ్రంగా గాయపడ్డవారిని ఎయిమ్స్‌కు పంపించే ఏర్పాట్లు చేయాలని సూచించానని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కేంద్రమంత్రి దేవేంద్ర ప్రధాన్‌తో కూడా మాట్లాడి బాధితులకు అన్నిరకాలుగా సాయం అందించాలని చెప్పినట్టు వివరించారు.

వెబ్దునియా పై చదవండి