కాశ్మీర్‌లో వరద భీభత్సం.. జనజీవనం అస్తవ్యస్థం... ఎనిమిది మంది మృతి..!

సోమవారం, 30 మార్చి 2015 (13:11 IST)
కాశ్మీర్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు ఎనిమిది మంది మృతి చెందగా, 13 మంది వరద నీటిలో గల్లంతయ్యారు. వరదల కారణంగా దక్షిణ కాశ్మీర్ అంతటా జనజీవనం అస్తవ్యస్థమైంది. ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. 
 
కాశ్మీర్ లో సోమవారం ఉదయం నుంచి భారీ వర్షాలు కురస్తున్నాయి. జీలం నది ఉప్పొంగింది. వరద నీటి ముంపు ప్రమాదం ఉండడంతో లోతట్టు ప్రాంతాల్లోను, జీలం నది తీరంలోను నివసించే ప్రజలను అక్కడి నుంచి అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.
 
దక్షిణ కాశ్మీర్ లో కురిసిన వర్షానికి చాలా ప్రాంతాల్లో వరద నీరు చేరింది. జీలం నది అయితే ప్రమాద స్థితి మించి ప్రవహిస్తోంది. ప్రజలను తమ తమ స్థలాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలని కోరారు. సంగం ప్రాంతంలో దాదాపు 21 అడుగుల ఎత్తుకు నీరు చేరిపోయింది. 
 
శ్రీనగర్ లోని రాం మున్షీ బాగ్ ప్రాంతంలో 18.8 అడుగుల ఎత్తున వరదనీరు చేరిపోయింది. అధికారులు రంగంలోకి దిగి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. వరద ఉదృతికి కనీసం 8 మంది మరణించినట్లు సమాచారం. మరో 13 మంది జాడ తెలియడం లేదు. 

వెబ్దునియా పై చదవండి