గాజులు అమ్మి ఏఐఎస్ అయ్యాడు.. పోలియో వ్యాధిగ్రస్తుడి విజయగాథ

బుధవారం, 12 సెప్టెంబరు 2018 (10:26 IST)
లక్ష్యాన్ని సాధించాలన్న పట్టుదల, అందుకు తగిన కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చని ఓ పోలియో వికలాంగుడు నిరూపించాడు. కటిక పేదరికంలో జన్మించి... చదువుకోవడానికి వసతులు లేకపోవడంతో వీధివీధి తిరుగుతూ గాజులు విక్రయించాడు. ఉన్నత చదువులే లక్ష్యంగా… కష్టించి విద్యార్థి స్థాయి నుంచి ఐఎఎస్ క్యాడర్ స్థాయి వరకు ఎదిగాడు. అధికారిగా విధులు నిర్వర్తిస్తూనే… పేద విద్యార్థులకు చేయూతనందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆయన పేరు రమేష్ ఘోలప్. మహారాష్ట్ర వాసి.
 
ఈయన సోలాపూర్ జిల్లా బర్షీ తాలుకాలోని మహాగోగన్ గ్రామంలో జన్మించాడు. చిన్నప్పటినుంచే చురుకైన పిల్లాడు. తండ్రి గోరఖ్ ఘోలప్ సైకిల్ రిపేర్ షాపు నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే తండ్రి తాగుడుకు బానిసై రమేశ్ చిన్న తనంలోనే చనిపోయాడు. కుటుంబ బాధ్యతలు తల్లి విమల్ ఘోలప్ తీసుకుంది. సొంతూరులోనే గాజుల షాపు నడుపుతూ కుటుంబానికి అండగా ఉండేది. చిన్న వయస్సులోనే పొలియో బారిన పడిన రమేశ్.. తన అన్నతో కలిసి తల్లికి సాయం చేసేవాడు. 
 
అన్న, మామ సహకారంతో విద్యాభ్యాసం పూర్తి చేశాడు. ఒకవైపు పేదరికం వెంటాడుతున్నా… తన తెలివితేటల ముందు పేదరికం అడ్డురాలేదు. ఫలితంగా బ్రిలియంట్ స్టూడెంట్‌గా అవతరించాడు. తొలుత ఉపాధ్యాయ వృత్తిలో చేరాడు. అయితే, తండ్రి మరణంతో తల్లికి వచ్చే ప్రభుత్వ పింఛన్ రాకపోవడం… బాధ్యతయుతంగా పనిచేయాల్సిన అధికారులు సక్రమంగా పనిచేయకపోవడం… రమేశ్‌ను ఎంతగానో బాధించాయి. తానో ప్రభుత్వ అధికారి అయితైనే ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చని భావించాడు.
 
కుటుంబ సహకారంతో.. టీచర్ల సహకారంతో సివిల్స్‌కు సిద్ధమయ్యాడు. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా… కష్టాల అధిగమించి ఐఏఎస్ సాధించాడు. ప్రస్తుతం జార్ఖండ్.. ఇంధన శాఖలో సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఒకప్పుడు గాజులు అమ్మిన అబ్బాయి.. పేదరికాన్ని, పోలియో బాధలను జయించి.. ఐఏఎస్ క్యాడర్ స్థాయి ఎదిగాడు. ఆయన స్ఫూర్తితో ఎంతోమంది యువత సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు