అయితే, ఈ మంచునే ఇంధనంగా మార్చాలని జపాన్ స్పేస్ ఎక్స్‌ప్లోరేటరీ ఏజెన్సీ (జాక్సా) నిర్ణయించింది. నాసాతో కలిసి ఇప్పటికే చంద్రుడి కక్ష్యలో అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకు జాక్సా ప్రణాళికలు రూపొందించింది. దీంతోపాటు చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద ఓ ఇంధన కర్మాగారాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించింది.
చంద్రుడిపై అన్వేషణ కోసం అంతరిక్ష యాత్రకు ఇంధనాన్ని భూమి నుంచి తీసుకెళ్లాల్సి వస్తోందని, దీనివల్ల ఖర్చు తడిసిమోపుడు అవుతోందని అంటోంది. ఈ ఖర్చు తగ్గించుకోవడం కోసమే 2035 నాటికి చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద ఇంధనం తయారీ ప్లాంట్ నిర్మాణానికి సిద్ధపడుతోంది.
అక్కడ మంచు రూపంలో ఉన్న ఆక్సిజన్, హైడ్రోజన్ వాయువులను సోలార్ సెల్ ద్వారా వేరు చేసి, వాటిని మళ్లీ కలపి ఇంధనాన్ని తయారుచేయనుంది. దీంతో చంద్రుడి కక్ష్యలో ఏర్పాటు చేసే అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రుడిపైకి వెళ్లే వ్యోమనౌకలకు ఉపయోగించే ఇంధనం అక్కడే లభిస్తుందని జాక్సా వెల్లడించింది. మరి ఇది ఏ మేరకు విజయవంతం అవుతుందో చూడాలి.