విరిగిపడిన మంచు చరియలు.. తపోవన్ విద్యుత్ ప్లాంట్‌కు ముప్పు: 150 మంది గల్లంతు

ఆదివారం, 7 ఫిబ్రవరి 2021 (16:49 IST)
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో తపోవన్ విద్యుత్ ప్లాంట్‌కు పెను ముప్పు సంభవించింది. మంచు కొండచరియలు విరిగిపడటంతో ధౌలిగంగా నదికి ఆకస్మికంగా పోటెత్తింది. ఒక్కసారిగా వరద పోటెత్తడంతో నదిలోని నీరు ఒక్కసారిగా తపోవన్ ఎన్టీపీసీ పవర్ ప్లాంటులోకి ప్రవేశించాయి. దీంతో 150 మంది గల్లంతయ్యారు. ఇప్పటివరకు కేవలం మూడు మృతదేహాలను మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. 
 
ఈ ప్రమాదంపై ఎన్టీపీసీ సైట్ ఇంజినీర్ స్పందిస్తూ, గల్లంతైన వారు చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. ఇప్పటివరకు మూడు మృతదేహాలు లభ్యమయ్యాయని సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్న ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ప్రతినిధి వెల్లడించారు.
 
ఇక్కడి హిమాలయ పర్వత సానువుల్లో మంచు చరియలు విరిగిపడగా, ధౌలిగంగా నదిలో నీటిమట్టం ఉన్నట్టుండి పెరిగిపోయింది. దాంతో వరద నీరు సమీపంలోని డ్యాట్ సహా, పవర్ ప్లాంట్‌ను, రేనీ గ్రామాన్ని ముంచెత్తింది. అధికారులు రేనీ గ్రామం నుంచి ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు.
 
కాగా ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఉత్తరాఖండ్‌లో పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్టు మోడీ పేర్కొన్నారు. ఘటనపై అమిత్ షా ఆరా తీశారు. ప్రస్తుతం ధౌలిగంగా పరీవాహక ప్రాంతాల్లో హై అలర్ట్ విధించారు. సహాయచర్యలు కొనసాగుతున్నాయి.
 
ఈ ఘటనపై కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి స్పందించారు. గతంలో జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసిన ఉమాభారతి దీనిపై ట్వీట్ చేస్తూ.... హిమాలయ పర్వత ప్రాంతం ఎంతో సున్నితమైనదని, గంగానది, దాని ఉపనదుల పరీవాహక ప్రాంతాల్లో విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించకపోవడమే మంచిదని తాను మంత్రిగా ఉన్న సమయంలోనే విజ్ఞప్తి చేశానని వివరించారు. కానీ, ఇక్కడ విద్యుత్ ప్లాంట్ నిర్మించారనీ, ఇపుడు దాని ఫలితాన్ని చవిచూస్తున్నట్టు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు