గోవాలో బీజేపీ ఆశలపై ఓటర్లు నీళ్లు చల్లారు. గోవాలో తిరిగి అధికారాన్ని కైవసం చేసుకోవాలనుకున్న కమలం పార్టీకి కళ్లుబయర్లుకమ్మాయి. గోవా సీఎం లక్ష్మీకాంత్, కాంగ్రెస్ అభ్యర్థి దయానంద్ రఘునాథ్ చేతిలో ఓడిపోయారు. మొత్తం 40 స్థానాలున్న అసెంబ్లీలో 1 ఫలితం, 18 స్థానాల ట్రెండ్స్ వెల్లడి కాగా, కాంగ్రెస్ ఒక చోట గెలిచి, 7 చోట్ల ఆధిక్యంలో ఉంది. బీజేపీ 7 చోట్ల, ఇతరులు 4 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంతమాత్రమూ ప్రభావం చూపలేకపోయిందని ఫలితాలను బట్టి తెలుస్తోంది.
ఇకపోతే.. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్ వాదీ పార్టీకి చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టిన సమాజ్ వాదీ, ఫలితాలను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో విఫలమైంది. మొత్తం 403 స్థానాలున్న యూపీ అసెంబ్లీలో 338 స్థానాల ట్రెండ్స్ వెల్లడవుతుండగా, బీజేపీ కూటమి 237 స్థానాల్లో సత్తా చాటింది. తద్వారా సొంత సర్కారు ఏర్పాటు దిశగా అడుగులేస్తోంది. ఇక సమాజ్ వాదీ పార్టీ 69 సీట్లలో ఆధిక్యంలో నిలిచింది. అలాగే బీఎస్పీ 29 స్థానాల్లో, ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. మరో 65 స్థానాల ట్రెండ్స్ వెల్లడి కావాల్సి వుంది.