ఆర్థిక అంశాలపై ప్రభుత్వం కసరత్తు: నిర్మలా సీతారామన్‌

శనివారం, 14 డిశెంబరు 2019 (10:20 IST)
ఆర్థిక అంశాలపై ప్రభుత్వం కసరత్తు సాగిస్తోందని, పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. 
 
దివాలా చట్టంపై ప్రభుత్వం సత్వరం స్పందించిందని ఆమె చెప్పుకొచ్చారు. సోమవారం నుంచి బడ్జెట్‌ ముందస్తు సంప్రదింపులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఇక ఆర్థిక ఉదార విధానాలను కొనసాగిస్తుండటంతో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రధమార్ధంలో రికార్డుస్ధాయిలో దేశంలోకి వచ్చాయని ప్రధాన ఆర్థిక సలహాదారు సుబ్రమణియన్‌ పేర్కొన్నారు.
 
 ప్రాధాన్యేతర రంగాల్లో పెట్టుబడుల ఉపసంహరణను ప్రభుత్వం వేగవంతం చేసిందని చెప్పారు. ఆర్థిక వృద్ధిని పెంపొందించేందుకు వినియోగం పెంచడంపై ప్రభుత్వం దృష్టిసారించిందని అన్నారు. ప్రభుత్వం గత కొద్దినెలలుగా ప్రకటించిన చర్యలతో ఫలితాలు ఇవ్వడం మొదలైందని తెలిపారు. 
 
కార్పొరేట్‌ ట్యాక్సుల తగ్గింపు, ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధన సమీకరణ, నిలిచిపోయిన నిర్మాణ ప్రాజెక్టులకు ఊతం వంటి పలు చర్యలను ప్రభుత్వం చేపట్టిందని గుర్తుచేశారు. రిటైల్ రుణాల జారీ కోసం ఎన్‌బీఎఫ్‌సీలు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలకు రూ 4.47 లక్షల కోట్లు మంజూరు చేశామని తెలిపారు. 
 
ప్రభుత్వ రంగ బ్యాంకులు కార్పొరేట్లకు రూ 2.2 లక్షల కోట్లు, చిన్నమధ్యతరహా కంపెనీలకు రూ 72985 కోట్ల రుణాలను మంజూరు చేశాయని చెప్పారు. ఇక ఇప్పటివరకూ రూ 1.57 లక్షల కోట్ల ఐటీ రిఫండ్‌లను ఆదాయ పన్ను శాఖ జారీ చేసిందని, ఇది గత ఏడాదితో పోలిస్తే 27.2 శాతం అధికమని రెవెన్యూ కార్యదర్శి అజయ్‌ భూషణ్‌ పాండే వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు