దేశంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధానం ఈనెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. అయితే, జీఎస్టీపై పెద్దగా అవగాహన లేని ప్రభుత్వ ఉద్యోగులు పన్ను వసూలు చేసి చిక్కుల్లో పడ్డారు. ఇలాంటి వారిలో ఓ ట్రావెలింగ్ టిక్కెట్ ఎగ్జామినర్ (టీటీఈ) కూడా ఒకరు. జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రయాణికుల నుంచి రూ.20ను అదనంగా వసూలు చేసి ఉద్యోగాన్ని ఊడగొట్టుకున్నాడు. ఈ వివరాలను పరిశీలిస్తే..
శనివారం అర్థరాత్రి గుజరాత్ క్వీన్‌ఎక్స్‌ప్రెస్ పరుగులు తీస్తోంది. అంతలో టీటీఈ ప్రయాణికుల వద్దకు వచ్చాడు. ఒక్కొక్కరు రూ.20 ఇవ్వాలని అడిగాడు. ఎందుకని వారు ప్రశ్నిస్తే.. ‘జీఎస్టీ పన్ను’ అని చెప్పాడు. జీఎస్టీ అమల్లోకి వచ్చిందని, దాని ప్రకారం రైల్వే రేట్లను రివైజ్ చేసిందని, ఆ మేరకు ఒక్కొక్కరూ రూ.20 కట్టాలని వసూలు చేశాడు.
అదనంగా 20 రూపాయలు వసూలు చేయడంపై అధికారులు విచారణ చేపట్టారు. డబ్బులు వసూలు చేసిన సమయంలో ప్రయాణికులకు, టీటీఈ మధ్య వాగ్వాదం జరిగింది. టికెట్ రేట్లు మారినట్లు ఉన్న సర్క్యూలర్‌ను చూపించాలని ఈ సందర్భంగా టీటీఈని ప్రయాణికులు డిమాండ్ చేశారు. కానీ టీటీఈ మాత్రం ఎటువంటి సమాధానం ఇవ్వలేదు.
నిజానికి, జీఎస్టీ అమల్లోకి వచ్చినా, జూలై ఒకటో తేదీకి ముందు బుక్ చేసుకున్న టికెట్లపై అదనంగా ఎటువంటి చార్జీలు కట్టాల్సిన పని లేదని, జూలై 1 నుంచి మాత్రం జీఎస్టీ అమలవుతుందని రైల్వే ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.