వేదికపై కుప్పకూలిన గుజరాత్ ముఖ్యమంత్రి!

సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (10:07 IST)
గుజరాత్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఇటీవలే నోటిఫికేషన్ జారీచేశారు. ఈ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. 
 
ఈ ప్రచారంలో భాగంగా, వడోదర సమీపంలోని నిజామ్ పురాలో జరిగిన సభలో ప్రసంగిస్తున్న వేళ, సీఎం విజయ్ రూపానీ ఒక్కసారిగా వేదికపై కుప్పకూలారు. మాట్లాడుతూ ఒక్కసారిగా పడిపోవడంతో, బీజేపీ శ్రేణులు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. ఆయనకు వేదికపైనే ప్రథమ చికిత్స చేసి, ఆ తర్వాత అహ్మదాబాద్‌కు తరలించి, ఆసుపత్రిలో చేర్చారు.
 
నిజానికి గత రెండు రోజులుగా ఆయన స్వల్ప అస్వస్థతతో బాధపడుతున్నారట. అయినప్పటికీ ముందుగా షెడ్యూల్ చేసుకున్న కార్యక్రమాలను రద్దు చేసుకోలేదని వ్యాఖ్యానించిన బీజేపీ నేత దంగేర్, బాగా అలసి పోవడం వల్లే ఆయన స్పృహ తప్పారని అన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, మరో 24 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచుతామని వైద్యాధికారులు పేర్కొన్నారని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు