హర్యానా : తమ్ముడికి పంగనామం... చీటింగ్ కేసులో ముగ్గురి అరెస్టు

గురువారం, 14 మార్చి 2019 (14:44 IST)
ధన దాహం ఎంతటి వారినైనా మార్చేస్తుంది. ఏ పనైనా చేయిస్తుంది. దానికి బంధాలు అనుబంధాలు అనే తారతమ్యం లేదు. డబ్బు, ఆస్తి కోసం అన్నదమ్ములు, తండ్రి కోడుకులు మధ్య విరోధాలు పెరిగిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి సంఘటనే ఒకటి ఎన్నారై విషయంలో జరిగింది. సొంత తమ్ముడే అన్నను మోసం చేశాడు. అన్న ఆస్తులన్నీ తన కోడుకుల పేరుతో మార్చేశాడు. డబ్బు అవసరం వచ్చి పొలాలను విక్రయించాలనుకున్న అన్నకు చిల్లిగవ్వ మిగలకుండా చేశాడు. దాదాపు 3 కోట్ల రూపాయల మేర ముంచేశాడని బాధితుడు అవేదన వ్యక్తం చేశాడు. 
 
వివరాల్లోకి వెళితే, హర్యానాకు చెందిన హర్దీప్ సింగ్ అనే వ్యక్తి ఉద్యోగ నిమిత్తం 1971లొ అమెరికా వెళ్లాడు. చాలా కాలంగా అక్కడే ఉంటూ అప్పుడప్పుడూ ఇంటికి వచ్చేవాడు. అన్న భారత్‌లో లేకపోవడంతో తమ్ముడు తనకు వచ్చిన పవర్ ఆఫ్ అటార్నీ హక్కులతో అన్న పేరిట ఉన్న పొలాలను, స్థలాలను తన కుమారుడి పేరు మీదకు మార్చేశాడు. హర్దీప్ సింగ్‌కి ఇటీవల డబ్బు అవసరమై భారత్‌లో ఉన్న తన పొలాలను విక్రయించాలనుకున్నాడు. 
 
వాటిని కొనేందుకు అనేక పార్టీలు ముందుకు వచ్చాయి. అయితే అప్పుడే అసలు విషయం బయటపడింది. తన పొలాలన్ని ఇప్పుడు తన పేరు మీద లేవని తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యాడు. తమ్ముడే ఇలా మోసం చేయడంతో ఎవరికీ చెప్పుకోలేక పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హర్దీప్ సోదరుడు అవతార్‌ను, అతని కుమారులు హర్‌ప్రీత్, జస్మీత్‌లను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు