ఇటీవలి కాలంలో భర్త బాధిత మహిళలతో పాటు భార్య బాధిత పురుషుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ఈ సమస్యలతో కోర్టుకు కేసులు కూడా వస్తున్నాయి. వివాహానంతరం భార్య వేరు కాపురం పెట్టాలంటూ సతాయింపు వ్యవహారంపై సుప్రీంకోర్టు తీర్పు చెపుతూ... కట్టుకున్న భర్తను అతడి తల్లిదండ్రుల నుంచి వేరు చేస్తూ వేరే కాపురం పెట్టాలంటూ భార్య సతాయిస్తే అలాంటి మహిళకు విడాకులు ఇవ్వవచ్చని తీర్పునిచ్చింది. ఐతే ఈ చట్టం కేవలం హిందువులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టీకరించింది.
వివాహం చేసుకున్న తర్వాత వేరు కాపురంపై జస్టిస్ అనిల్ ఆర్.దవే, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పును ఇచ్చింది. తమ కన్నబిడ్డల కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పెద్దవారిని చేసి పెళ్లి చేసిన తర్వాత వారిని వేరు కాపురం పేరుతో వదిలేసి వెళ్లకూడదనీ, కన్నవారిని పోషించాల్సిన బాధ్యత కుమారుడిపై ఉంటుందని పేర్కొంది.