సప్తపది లేకుండా జరిగిన పెళ్ళి చెల్లదు : అలహాబాద్ హైకోర్టు

గురువారం, 5 అక్టోబరు 2023 (13:55 IST)
తనకు విడాకులు ఇవ్వకుండా మరో వివాహం చేసుకుందంటూ కోర్టుకెక్కిన ఓ భర్తకు అలహాబాద్ హైకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. సప్తపది లేకుండా జరిగిన వివాహం చెల్లదని స్పష్టం చేసింది. హిందూ వివాహాలలో సప్తపదికి విశేష ప్రాధాన్యత ఉందని, ఆ తంతు జరగకుండా వివాహానికి సంపూర్ణత రాదని పేర్కొంది. అందువల్ల ఈ కేసులో విడాకులు తీసుకునే ప్రశ్నే ఉత్పన్నం కాదంటూ పేర్కొంటూ పిటిషన్‌ను తోసిపుచ్చింది. 
 
హిందూ వివాహ చట్టం 1955, సెక్షన్ 7 ప్రకారం వధూవరులిద్దరూ హిందూ ఆచార వ్యవహారాల ప్రకారం వివాహ తంతును పూర్తి చేసినపుడే ఆ జంట భార్యాభర్తలుగా పరిగణించాలని కోర్టు పేర్కొంది. వివాహ తంతులో సప్తపది ముఖ్యమైన కార్యక్రమమని, ఈ కార్యక్రమం లేకుండా జరిగిన పెళ్లి చెల్లదని వివరించింది. 
 
గుజరాత్ రాష్ట్రానికి చెందిన సత్యం సింగ్, స్మృత సింగ్‌లు గత 2017లో వివాహం చేసుకున్నారు. తర్వాత కొంతకాలానికి అత్తింటి నుంచి వెళ్ళిపోయిన స్మృతి సింగ్... అదనపుకట్నం కోసం వేధిస్తున్నాడంటూ భర్తపై వరకట్న వేధింపులు కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణలో ఉండగానే తన భార్య మరో పెళ్ళి చేసుకుందని సత్యం సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై మీర్జాపూర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు విచారణ జరుపుతుంది. 
 
అయితే, సత్యం పిటిషన్ చెల్లదంటూ స్మృతి అలహాబాద్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు.. సత్యం, స్మృతిల మధ్య జరిగిన వివాహం చెల్లదని అందువల్ల స్మృతి సింగ్ మరో వివాహం చేసుకున్నారనే ప్రశ్నే ఉత్పన్నం కాదంటూ పిటిషన్ కొట్టివేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు