ఇండో-చైనా సరిహద్దుల్లో టెన్షన్.. టెన్షన్ : కేంద్ర హోం శాఖ హైఅలెర్ట్
బుధవారం, 2 సెప్టెంబరు 2020 (17:03 IST)
భారత్ - చైనా దేశాల సరిహద్దుల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. చైనా సైనికుల చొరబాట్లను భారత బలగాలు సమర్థమంతంగా ఎదుర్కొంటున్నాయి. దీన్ని జీర్ణించుకోలేని డ్రాగన్ సైనికులు.. కుటిల యత్నాలకు పాల్పడుతున్నారు. ఫలితంగా సరిహద్దుల్లో ఉద్రిక్తవాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా కూడా భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాలంటూ బుధవారం కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఇండో-చైనా సరిహద్దుతో పాటు ఇండియా-నేపాల్, ఇండో-భూటాన్ సరిహద్దుల్లో బలగాలు అన్నీ అలర్ట్‌గా ఉండాలని హోంశాఖ ఆదేశాలు ఇచ్చింది. చైనాతో సరిహద్దు ఉన్న ప్రాంతాల్లో మరింత గస్తీని పెంచాలని ఇండో టిబెట్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ), సహస్త్రా సీమా బల్(ఎస్ఎస్‌బీ)కు ఆదేశాలు జారీ చేసింది.
అలాగే, ఇండో నేపాల్ సరిహద్దుకు ఎస్ఎస్బీ అదనపు బలగాలను పంపించారు. జమ్మూకాశ్మీర్, ఢిల్లీలో ఉన్న వారిని సరిహద్దుకు తరలించారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకున్నది.
కాగా, గత రెండు రోజులుగా పాన్‌గాంగ్ సో సరస్సు, రీజాంగ్ లా, రీక్విన్ లా, స్పాన్‌గుర్ గాప్ ప్రాంతాల్లో ఆక్రమణకు ప్రయత్నించిన చైనా దళాలను భారతీయ సైనికులు అడ్డుకున్నారు. ఆగస్టు 29, 30 తేదీల్లో ఈ ఘటన జరిగింది. దీంతో డ్రాగన్ బలగాలు ప్రతీకారంతో రగిలిపోతున్నాయి. అదేసమయంలో ఈస్ట్రన్ లడఖ్‌లోని పాన్‌గాంగ్ వద్ద ఉన్న కీలక స్థావరాలకు భారత్ ఆయుధాలను తరలించింది.
మరోవైపు, సరిహద్దు వివాదానికి తెరదించేందుకు ఓవైపు సంప్రదింపులు సాగుతున్నా తోకజాడిస్తున్న చైనాకు బుద్ధిచెప్పేందుకు భారత్ సంసిద్ధమైంది. డ్రాగన్ సైన్యం హద్దు మీరితే బుద్ధిచెప్పేందుకు భారీఎత్తున దళాలు, ట్యాంకులతో సన్నద్ధమైంది. ఇరు పక్షాలు ఎల్‌ఏసీ వద్ద పెద్దసంఖ్యలో మోహరించడంతో సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.