కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనడమెలా?

గురువారం, 26 నవంబరు 2020 (07:47 IST)
కరోనా కేసులు రాష్ట్రంలో తగ్గుముఖంపడుతున్నాయి. కాలేజీలు, స్కూళ్లు కూడా ప్రారంభం అవుతున్నాయి. జనజీవనం సాధారణ కార్యకలాపాల్లో మునిగిపోయారు. అంతమాత్రాన వైరస్ ముప్పు నుంచి మనం బయటపడినట్టే అనుకోవద్దు.

అసలే చలికాలం. సాధారణ జ్వరాలతోపాటు వైరల్ ఫీవర్లు వీటికితోడు వైరస్ రెండోసారి వ్యాప్తి చెందవచ్చన్న ప్రచారం నేపథ్యంలో ప్రజలు కూడా మరింత బాధ్యతగా వైరస్ వ్యాప్తి నిరోధానికి అవసరమైన జాగ్రత్తలను పాటించాలి.

ముఖ్యంగా మన రోజువారీ కార్యకలాపాలు, ఆహార అలవాట్లలోనూ మార్పులు చేసుకుని కోవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కోవాలి.

కరోనా వాక్సిన్లు ఇంకా ప్రయోగాల దశలో ఉన్నాయి. కాబట్టి మన జాగ్రత్తల్లో మనం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకోసం మనం పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఇవి.
 
* సాధ్యమైనంత వరకు విదేశీ ప్రయాణాలను మరికొంతకాలం వాయిదా వేసుకోండి.
 
* కనీసం ఏడాదిపాటు బయటి నుంచి ఆహారాన్ని తెచ్చుకుని తినవద్దు. ఇంట్లోనే చేసుకుని తినండి. 
 
* పెళ్లిళ్లు, ఇతర వేడుకలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. తప్పనిసరి అయితేనే వెళ్లండి. 
 
* అత్యవసరమైతేనే ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు, యాత్రలు చేయండి.
 
* కనీసం ఒక సంవత్సరంపాటు రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లవద్దు.
 
* భౌతిక దూరం నిబంధనలను మాత్రం తప్పనిసరిగా పాటించండి. ఎదుటి వ్యక్తికి కనీసం ఆరడుగులు లేదా రెండు గజాల దూరంలో ఉండండి
 
* దగ్గు, తుమ్ములు ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండండి. మీ కళ్లు, ముక్కు, నోటిని అనవసరంగా తాకకండి. ఎందుకంటే వీటి ద్వారానే వైరస్ మన శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది.  ఒకవేళ తాకినట్టయితే వెంటనే చేతులను శుభ్రం చేసుకోండి.
 
* బయటకి వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరూ మాస్కును ధరించాలి. సర్జికల్ మాస్కులు అయితే ఒకసారి వాడిన మాస్కును మళ్లీ ఉపయోగించవద్దు. ఇంట్లోనే తయారు చేసుకుని తిరిగి ఉపయోగించుకోగలిగే కాటన్ మాస్కులను వాడండి. క్లాత్ మాస్కు అయిన ఒకసారి వాడిన తర్వాత మళ్లీ ఉతికిన తర్వాతే వాడండి.
 
* మరికొన్ని నెలలు సినిమా, మాల్స్, రద్దీగా ఉండే మార్కెట్లకు వెళ్లవద్దు. వీలైతే పార్కులకు వెళ్లడం, పార్టీలు మొదలైన వాటికి దూరంగా ఉండండి. 
 
* రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు అవసరమైన విధంగా ఆహారపు అలవాట్లను మార్చుకోండి.
 
* బార్బర్ షాపులో లేదా బ్యూటీ సెలూన్స్ లో ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండండి.
 
* కరోనా ముప్పు ఇప్పటికిప్పుడు ముగిసిపోదు. కాబట్టి ముఖ్యమైన సమావేశాలకు మాత్రమే వెళ్లండి. అవసరంలేని మీటింగ్స్ కు దూరంగా ఉండండి. ఇతరులో మాట్లాడేటప్పుడు మాత్రం భౌతిక దూరాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. 
 
 * కర్చీఫ్ ను ఎక్కువగా వినియోగించవద్దు. వీలైనంత వరకు శానిటైజర్, టిష్యూలను ఉపయోగించండి. అవకాశం ఉంటే తరచుగా సబ్బు, నీటితో చేతులను శుభ్రం చేసుకోండి.
 
* బయటి నుంచి ఇంట్లోకి వచ్చే ముందు చేతులు, కాళ్లను శుభ్రం చేసుకోవాలి. 
 
* ఒకవేళ మీరు కరోనా లక్షణాలున్నట్టు అనుమానాస్పదంగా ఉండే వ్యక్తికి దగ్గరగా ఉండి వచ్చారని అనిపించినప్పుడు వేడినీటితో పూర్తిగా స్నానం చేయండి.
 
* బంధువులు, స్నేహితులు కనిపిస్తే  దూరం నుంచే పలకరించుకోండి. వారి యోగ క్షేమాలకు సంబంధించిన సమాచారం తెలుసుకోండి
 
* శ్వాసకోశ పరిశుభ్రతలను పాటించండి. తుమ్ము, దగ్గు వచ్చినపుడు మీ మోచేతిని అడ్డుపెట్టుకోండి. లేదా హ్యాండ్ కర్చీఫ్ ఉపయోగించండి. 
 
* మీ చేతులను తరచుగా ఆల్కాహాల్ శానిటైజర్ తోగానీ, సబ్బు నీటితో గానీ కనీసం 20 నుంచి 40 సెకన్లపాటు శుభ్రంగా కడుక్కోవాలి.
 
* ఒకవేళ జ్వరం, దగ్గు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటే వెంటనే 104 నంబర్ కు ఫోన్ చేయండి
 
* మానసికంగా ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నట్టు భావిస్తే అవసరమైన సలహా లేదా సాయం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 104, వై.ఎస్.ఆర్ టెలీమెడిసిన్ నెంబర్ 14410కు మిస్డ్ కాల్ ఇచ్చి ఫోన్ ద్వారా డాక్టర్ గారితో మాట్లాడి మీ ఆరోగ్య సమస్యలను తెలపవచ్చు.   

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు