స్థానిక టీ నగర్‌లోని దీపా నివాసం ఇపుడు శశికళ నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అన్నాడీఎంకే కార్యకర్తలతో నిత్యం సందడిగా ఉంది. తనకు మద్దతునిచ్చేందుకు ఇంటికి వస్తున్న వారిని ఆప్యాయంగా పలుకరిస్తూ ఆమె వారి వద్ద అన్ని వివరాలు సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా దీపా మాట్లాడుతూ మా మేనత్తకు మా కుటుంబాన్ని దూరం చేసిన వారు ఎవ్వరూ బాగుపడరని ఆమె శాపనార్థాలు పెట్టారు.
జయలలిత ప్రాతినిథ్య వహించిన ఆర్కే నగర్ శాసనసభ నియోజక వర్గం నుంచి ఉప ఎన్నికల్లో మీరు పోటీ చేస్తారా అని మీడియా దీపాను ప్రశ్నిస్తే తాను శశికళ పోటీ చేసే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ఆమె సమాధానం ఇచ్చారు. మొత్తం మీద దీపా జయకుమార్ తన మేనత్తను దూరం చేసిన శశికళ మీద రాజకీయంగానే కక్ష తీర్చుకుంటానని పరోక్షంగా హెచ్చరించారు. దీపా జయకుమార్‌కు ద్వితీయ, తృతీయ స్థాయి నేతలు, కార్యకర్తల నుంచి ఊహించని స్థాయిలో మద్దతు వస్తున్నది.