మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రత్యేక రైలులో యూపీ వెళ్లిన రాష్ట్రపతి కోవింద్.. స్వగ్రామం పరౌంక్ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ, ప్రజలంతా కర్తవ్యదీక్షతో పన్నులు చెల్లించాలన్నారు.
ప్రస్తుతం దేశంలో అత్యధిక జీతం అందుకుంటున్న వ్యక్తి రాష్ట్రపతి అని అందరికీ తెలుసు అని, ప్రతి నెలా రూ.2.75 లక్షలు నెలకు ట్యాక్స్ కడుతున్నానన్నారు. ప్రతి నెలా 5 లక్షల జీతం వస్తుందని అందరూ అంటుంటారని, కానీ దానికి కూడా ట్యాక్స్ ఉంటుందని తెలుసుకోవాలన్నారు.
రాష్ట్రపతి కోవింద్ తాను ట్యాక్స్ కడుతున్నట్లు చెప్పగానే అక్కడ ఉన్న ప్రజలంతా చప్పట్లు కొట్టారు. తాను ఆదా చేసిన దాని కన్నా.. అధికారులు ఎక్కువ సంపాదిస్తారని, ఇక్కడ ఉన్న టీచర్లు అంత కన్నా ఎక్కువ సంపాదిస్తున్నారన్నారు.
పన్నులు చెల్లించడం వల్ల అభివృద్ధి జరుగుతుందన్న విషయాన్ని చెప్పేందుకు తాను ఇలా మాట్లాడుతున్నట్లు రామ్‌నాథ్ తెలిపారు. సాధారణ పల్లె పౌరుడు ఇలా దేశ అత్యున్నత పదవిని అలకరిస్తారని తానెప్పుడు అనుకోలేదని, కానీ ప్రజాస్వామ్య వ్యవస్థ వల్లే ఇది సాధ్యమైందని రామ్‌నాథ్ కోవింద్ తెలిపారు.