మా నాన్న చనిపోబోతున్నాడని మాకు ముందే తెలుసు : రాహుల్ గాంధీ

ఆదివారం, 11 మార్చి 2018 (13:47 IST)
మా నాన్న రాజీవ్ గాంధీ చనిపోబోతున్నాడని మాకు ముందే తెలుసు అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం అక్కడ ఐఐఎం పూర్వ విద్యార్థులతో సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'మా నాన్న (రాజీవ్ గాంధీ) చనిపోబోతున్నాడని మాకు ముందే తెలుసు. మా నానమ్మ (ఇందిరా గాంధీ) చనిపోతోందని మాకు ముందే తెలుసు. రాజకీయాల్లో ఉండి దుష్ట శక్తులకు వ్యతిరేకంగా పని చేస్తున్నా.. దేనికోసమైనా గట్టిగా నిలబడినా మరణం తప్పదు. ఇది స్పష్టం..' అని రాహుల్ స్పష్టంచేశారు.
 
తన తండ్రి రాజీవ్ గాంధీ హత్య తర్వాత చాలా కాలం కోపంగా ఉండేదని.. కానీ తర్వాత వారిని పూర్తిగా క్షమించేశామన్నాడు. ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ చనిపోయినప్పుడు టీవీలో అతడి మృతదేహాన్ని చూశానని, ఆ సమయంలో తనకు రెండు రకాల భావాలు కలిగాయన్నారు. 
 
'ఒకటేమిటంటే.. వాళ్లు (శ్రీలంక ప్రభుత్వం) ప్రభాకరన్‌తో అలా ఎందుకు అవమానకరంగా వ్యవహరించారు అనిపించింది. ఇక ప్రభాకరన్ గురించి, అతని పిల్లల గురించి ఆలోచిస్తే బాధనిపించింది. ఏదైనా హింసాత్మక ఘటన జరిగినప్పడు దాని వెనుక ఖచ్చితంగా ఓ మనిషి ప్రమేయం ఉంటుంది. ఓ కుటుంబం ఉంటుంది, ఓ చిన్నారి రోదన ఉంటుంది. అలాంటి బాధను నేను కూడా అనుభవించాను. మనుషులను ద్వేషించడం చాలా కష్టం..' అంటూ వ్యాఖ్యానించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు