మైనార్టీ తీరని అంటే 18 యేళ్లలోపు వారు సహజీవనం చేయడం చట్ట విరుద్ధం, అనైతికమని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. 18 ఏళ్ల కంటే తక్కువ ఉన్న అబ్బాయి.. వయస్సులో తన కంటే పెద్దదైన అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడనే కారణంతో నేర విచారణ నుంచి రక్షణ పొందలేడని, వారి చర్యలు చట్టపరమైనవి కాదని జస్టిస్ వివేక్ కుమార్ బిర్లా, జస్టిస్ రాజేంద్ర కుమార్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ ఈ పిటీషన్‌ను కోర్టు కొట్టివేసింది.
ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 19 ఏళ్ల అమ్మాయి, 17 ఏళ్ల అబ్బాయి ఇంట్లోంచి వచ్చి ప్రయాగ్‌రాజ్‌లో సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో అమ్మాయి కనిపించడం లేదని ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం వారి ఆచూకీ తెలియడంతో అమ్మాయి కుటుంబసభ్యులు ఇద్దరిని బలవంతంగా వారి గ్రామానికి తీసుకెళ్లారు.
అక్కడి నుంచి తప్పించుకున్న అమ్మాయి.. జరిగిన ఘటన మొత్తాన్ని అబ్బాయి తండ్రికి తెలియజేసింది. దీంతో ఆయన అబ్బాయి తరపున కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాంతోపాటు అబ్బాయిపై క్రిమినల్ చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పించాలని అమ్మాయి మరో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన అలహాబాద్ న్యాయస్థానం 18 ఏళ్లలోపు వారు సహజీవనం చేయడం అనైతికమని వ్యాఖ్యానించింది.
ఇద్దరు వ్యక్తులు తమ ఇష్టపూర్వకంగా జీవించేందుకు హక్కు ఉంటుందని, అయితే.. వారు మేజర్లు అయి ఉండాలని ధర్మాసనం అభిప్రాయపడింది. అమ్మాయి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నమోదైన కేసులో అబ్బాయిపై మోపిన నేరానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు కోర్టుకు సమర్పించని కారణంగా, నేరం జరిగిందనే అభిప్రాయానికి రాలేమని కోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై సమగ్ర విచారణ చేయాలని దర్యాప్తు అధికారిని ఆదేశించింది.