పబ్లిక్ ప్రదేశాల్లో తుమ్మాలంటూ టెక్కీ ప్రచారం.. అరెస్టు.. ఆపై ఉద్యోగం గోవిందా...

శనివారం, 28 మార్చి 2020 (12:56 IST)
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వాలతో పాటు.. సెలెబ్రిటీలు కూడా తమవంతుగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమలో ఓ టెక్కీ మాత్రం విరుద్ధంగా ప్రవర్తించాడు. అందరూ కరచాలనం చేయాలనీ, పబ్లిక్ ప్రదేశాలకు వచ్చి తుమ్మాలని, తద్వారా కరోనా వైరస్‌ను వ్యాపించజేయాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. ఈ విషయం సైబర్ క్రైమ్ బ్రాంచ్ దృష్టికి వెళ్లింది. అంతే.. పోలీసులు వచ్చి మక్కెలిరగగొట్టి... కటకటాల వెనక్కి నెట్టారు. సమాచారం అందుకున్న ఇన్ఫోసిస్ కంపెనీ కూడా ఉద్యోగం ఊడపీకింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముజీబ్ మొహమ్మద్ అనే వ్యక్తి బెంగళూరులో ఇన్ఫోసిస్ సంస్థలో పని చేస్తున్నాడు. కరోనాను ఎలా కట్టడి చేయాలి? అనే విషయంపైనే ఇప్పుడు ప్రతి ఒక్కరూ మాట్లాడుతుంటే... ఇతను మాత్రం కరోనాను ఎలా వ్యాపింపజేయాలో సోషల్ మీడియాలో సూచనలు ఇచ్చాడు. 
 
అసలు ఇతగాడు ఏం చెప్పాడంటే... 'అందరూ చేతులు కలపండి. బయటకు వచ్చి పబ్లిక్ ప్రదేశాల్లో తుమ్మండి. వైరస్‌ను విస్తరింపజేయండి'. ఇదీ.. ఫేస్‌బుక్‌లో 25 ఏళ్ల యువకుడు చేస్తున్న ప్రచారం. ఈ విషయం తెలుసుకున్న బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు షాక్ అయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. అతన్ని గుర్తించి కటకటాల వెనక్కి పంపించారు.
 
ఈ సందర్భంగా బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ సందీప్ పాటిల్ మాట్లాడుతూ, కరోనాను విస్తరింపజేయాలని కోరుతున్న ముజీబ్‌ను కటకటాల వెనక్కి పంపించామని తెలిపారు. ముజీబ్ వ్యవహారంపై ఇన్ఫోసిస్ యాజమాన్యం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇన్ఫోసిన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ముజీబ్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నామని ప్రకటించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు